AP government unable to be tough in the fight against fake news : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ముగ్గురు సీనియర్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. ఓ గంట సేపు వివరణ ఇచ్చారు. విజయవాడ వరద సాయానికి సంబంధించిన అన్నిపత్రాలు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా  ప్రచారాలకే గంట సేపు ముగ్గురు మంత్రులు వివరణ ఇచ్చారు. అంతగా విజయవాడ వరద సాయంపై ఫేక్ ప్రచారం జరిగింది. అగ్గిపెట్టేలకే ఇరవై మూడు కోట్లు అంటూ ప్రచారం చేశారు. అది ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఒక్క అంశం కాదు ముఫ్పై జిల్లాల విభజన దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వరకూ ప్రతీ రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు  సమాచారం వెల్లువెత్తుతూనే ఉంది. 


ఫేక్ వార్తలు, గ్రాఫిక్ ఫోటోతో టీడీపీ ప్రభుత్వంపై దాడి


సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు ప్రతీ రోజా ఓ టాపిక్ ను ఎత్తుకుని  ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ లో చికిత్స అందించే జబ్బులను తగ్గించే జీవో విడుదల చేశారని ఓ పత్రం కూడా వైరల్ చేశారు. అది ఎంతగా వెళ్లిపోయిందంటే.. అందరూ నిజమే అనుకున్నారు. చివరికి అది ఫేక్ అని ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తేల్చేసింది. ఇది ఒక్కటి కాదు ముఫ్పై జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని ఓ జాబితాను సోషల్ మీడియాను వైరల్ చేశారు. అందులో బాపట్ల జిల్లా, అనకాపల్లి జిల్లాలను రద్దు చేయబోతున్నారని పెట్టారు. అదే పనిగా ప్రచారం చేశారు. చివరికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి విజయవాడ వరదల సమయంలో ఎన్నో ఫేక్ పోస్టులు వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ వరదల వీడియోలు తెచ్చి విజయవాడవని ప్రచారం చేశారు. పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే కందిపప్పు తూకం తక్కువ ఉందని వీడియోలు పోస్ట్ చేశారు. ఇక ఇసుకపై ఎంత ఫేక్ ప్రచారం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. 


పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట - టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్న దువ్వాడ, దివ్వెల


ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ క్యాడర్ ఆవేదన


ఫేక్ న్యూస్‌తో  వ్యతిరేక ప్రచారం ఉద్ధృతంగా జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. పక్కా  ఫేక్ అని తెలిసినా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల పేరుతో చేసిన ప్రచారంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నా నోటీసులు ఇచ్చి వదిలేశారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు . ఇలా వదిలేయడం వల్లనే వైసీపీ సానుభూతిపరుల్లో ధైర్యం పెరిగి ఇష్టం వచ్చినట్లుగా ఫేక్ పోస్టులు పెడుతున్నారని టీడీపీ క్యాడర్ అంటున్నారు. గతంలో చేసిన తప్పునే చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 



Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?



ఒపిక పడుతున్నామన్న సీఎం చంద్రబాబు 


ఈ ఫేక్ న్యూస్ దాడి వ్యవహారం ప్రభుత్వాన్ని , ప్రభుత్వ పెద్దలను దాటి వెళ్లడం లేదు. పూర్తి సమాచారం ఉంది. అయితే ప్రభుత్వ పరంగా చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ.. చట్టాన్ని  దాటి ఏమైనా చేయాలని అనుకోవడం లేదు. సహనంతో ఉన్నామని తప్పుడు ప్రచారాలు చేస్తే అలా వదిలేస్తామన అనుకోవద్దని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నామని అంటున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సీఐడీ అధికారులు అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అయినా అరెస్టు చేసేవారు. ఇప్పుడు ఒక్కర్ని కూడా అలా అరెస్టు చేయలేదు. తాము అలాంటివి చేయబోమని.. హద్దు మీరితే మాత్రం ఊరుకునేది లేదని చంద్రబాబు అంటున్నారు. టీడీపీ క్యాడర్ మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోతే దాడి ఇంకా పెరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.