Andhra Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు చోటు లభించలేదు. వారు చేసినట్లే మేము ఎందుకు చేయాలని టీడీపీ నేతలు అనుకున్నారు.కూటమి నేతలు కూడా అదే అనుకున్నారు. కానీ అది చేతకానితనంగా భావించారేమో కానీ సోషల్ మీడియాలో కూటమి నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టడం ప్రారంభమయింది. ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఇది కూటమి నేతలకు ఎలాంటి అసహనానికి గురి చేసిందంటే.. హోంమంత్రిత్వ శాఖపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యేంత. ఆయన అలా అనగానే ఇలా అరెస్టుల పర్వం ప్రారంభమయింది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు స్వేచ్చ కాదు !
సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే ఎవరూ ఏమీ అనరు.కానీ అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఇప్పటికి మూడు నాలుగు సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారి దాడి తగ్గకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. వీరిలో ఓ నిందితుడ్ని ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో వదిలేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భావప్రకటనా స్వేచ్చ అంటే.. బూతులు తిట్టడం కాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
విస్తృతంగా ఫేక్ న్యూస్
ఏపీలో జరుగుతున్న ప్రతి అంశంపైనా విస్తృతంగా ఫేక్ న్యూస్ స్పెడ్ అవుతూ ఉంటుంది. విజయవాడ వరదలపై జరిగిన తప్పుడు ప్రచారంపై మంత్రులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయినా ఆపకపోగా మీడియాలోనూ రావడంతో ఓ పత్రిక ఎడిటర్ పై కేసు పెట్టేశారు. అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఫేక్ పోస్టులపై అనేక సార్లు ఫ్యాక్ట్ చెక్ డిపార్టుమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది. ఇప్పుడు అలాగే కేసులు పెడుతున్నారు.
Also Read: Eluru Bike Recovery: స్కూటీని హత్తుకుని మహిళ కన్నీళ్లు - ఆ కష్టం వెనుక కథ ఏంటంటే?, వైరల్ వీడియో
వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసి తీసుకుపోయేవారు. ఇలా మొత్తం మూడు వేల కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని అదే అలుసుగా తీసుకున్నారని ఇక సహించేది లేదని అంటున్నారు. సోషల్ రాజకీయంలో అసలు బాధితులుగా కార్యకర్తలే మిగులుతున్నారు.