Pawan Kalyan met Union Home Minister Amit Shah in delhi: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఆయన దాదాపుగా ఇరవై నిమిషాల సేపు అమిత షాతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు తన మంత్రిత్వ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ విజయవాడ బయలుదేరారు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ అధికారిక పర్యటన మీద ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి. అయితే ఈ పర్యటనలో ఆయన కేవలం అమిత్ షాతో మాత్రమే భేటీకి షెడ్యూల్ చేసుకున్నారు. అమిత్ షాతో సమావేశం కోసం గతంలోనే పవన్ కల్యాణ్ పేషీ నుంచి ప్రతిపాదనలు వెళ్లే...తాజాగా అపాయింట్మెంట్ ఖరారు చేశారని అందుకే పవన్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఏపీలో పరిస్థితులపై ఆయన ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. రాజకీయ అంశాలనూ నివేదికలో పొందు పరిచినట్లుగా భావిస్తున్నారు.
Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
శాంతిభద్రతల అంశంపై మరింత కఠినంగా వ్యవహరించాలనే ఆలోచన
రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్ పిఠాపురంలో మాట్లాడినప్పుడు శాంతిభద్రతల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితను బాధ్యత తీసుకోవాలని హెచ్చరించడంతో పాటు తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ లో శాంతిభద్రతల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఈ విషయంలో కేంద్రం సహకారం ఉండాలని పవన్ కల్యాణ్ కోరినట్లుగా చెబుతున్నారు. అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ కీచకులుగా మారిన వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !
చర్చించిన అంశాలపై కాసేపట్లో అధికారిక ప్రకటన
అమిత్ షాతో భేటీపై పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటనలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అమిత్ షా బిజీగా ఉన్న సమయంలోనూ పవన్ కల్యాణ్‌కు సమయం కేటాయించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే స్వల్ప సమయం మాత్రమే మాట్లాడారని అంటున్నారు.