AP Cabinet Key Decisions: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014 - 18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ మరిన్ని నిర్ణయాలు
- ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ - 1982 చట్టం (AP Land Grabbing Act - 1982) ఉపసంహరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూకబ్జాదారులపై కేసులు పెట్టడానికి నిబంధనలు అడ్డంకిగా ఉండడంతో రెవెన్యూ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో త్వరలో జరిగే శాసనసభలో పాత చట్టం రద్దు, కొత్త చట్టం రూపకల్పన చేయనున్నారు.
- అలాగే, ఏపీ రాజధాని ప్రాంత పరిధిని పునరుద్ధరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో సీఆర్డీఏ (CRDA) పరిధిని కుదించి అమరావతి ప్రాంతానికి పరిమితం చేయగా.. దాన్ని పునరుద్ధరించింది. సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లా 92 గ్రామాలు, బాపట్ల జిల్లా 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి వచ్చేలా కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చింది.
- కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పం డెవలప్‌మెంట్ అథారిటీ 4 మండలాలను, ఓ మున్సిపాలిటీని కవర్ చేస్తూ స్థాపించబడింది.
- ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డీనెన్స్ - 2024కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే, ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
- ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1984 సవరణ - జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
- పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిస్బర్షల్ - 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు త్వరగా సర్టిఫికెట్లు జారీకి మార్గం సుగమం అవుతుంది.
- అలాగే, 2014 - 15 నుంచి 2018 -19 మధ్య పూర్తైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- అటు, 2024, జూన్ 24 నుంచి అక్టోబర్ 23 వరకూ తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలపైనా రూపొందించిన నివేదికలపైనా చర్చ సాగింది. రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా రంగం తదితర విషయాల్లో సీఎం అమాత్యులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!