AP MEGA DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. టెట్ ఫలితాలు వెలువడగానే మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. ఏపీలో నవంబరు 4న టెట్ పరీక్షయ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేస్తారని అభ్యర్థులు ఆశించారు. కానీ తాజాగా మెగా డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి విద్యాశాఖ ఉసూరుమనిపించింది. అయితే నాలుగైదు రోజుల్లో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు.


ఎస్సీ రిజర్వేషన్లే కారణమా?
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ప్రధాన కారణం ఎస్సీ రిజర్వేషన్లే అని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దాకా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకూడదని ఒక పక్క ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలుకు పలు అంశాలను గురించి చర్చించారు. అయితే డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడం, దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.


16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులు ఉన్నాయి.ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కాగా, డీఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో అనేక విడతల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యా శాఖ యోచిస్తోంది.


జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:



  • శ్రీకాకుళం: 543

  • విజయనగరం: 583

  • విశాఖపట్నం: 1,134

  • తూర్పుగోదావరి: 1,346

  • పశ్చిమ గోదావరి: 1,067

  • కృష్ణా: 1,213

  • గుంటూరు: 1,159

  • ప్రకాశం: 672

  • నెల్లూరు: 673

  • చిత్తూరు: 1,478

  • వైఎస్సార్ కడప: 709

  • అనంతపురం: 811

  • కర్నూలు: 2,678


అర్హతలు:


➥ ఎస్జీటీ పోస్టులకు బీఈడీ లేదా డీఈడీ పూర్తి చేసి, టెట్‌లో అర్హత పొందాలి.


➥ ఎస్‌ఏ, టీజీటీ, పీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తిచేసి, టెట్ అర్హత ఉండాలి.


➥ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఎంబీఏ లేదా ఎంఏడ్ వంటి ఉన్నత విద్యార్హతలు కావాలి.


➥ పీఈటీ పోస్టులకు సంబంధిత శారీరక విద్యలో డిప్లొమా లేదా డిగ్రీ కావాలి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...