Pithapuram News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మరోసారి స్థలం రిజిస్ట్రేషన్ చేయించారు. ఈసారి ఏకంగా 12 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 15 ఎకరాలపైగా భూమిని పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని పేరు ప్రకటించిన తర్వాత ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేశారు. అతిథిలా వచ్చి వెళ్లిపోతారని అసలు పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండబోరని వైసీపీ నేతలంతా దుమ్మెత్తి పోశారు. విమర్శలకు తన చర్యలతోనే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పారు. విజయం సాధించిన తర్వాత అక్కడ భూమి కొనుగోలు చేసి విమర్శలకు చెక్ పెట్టారు. అంతే కాకుండా ఆరు నెలల వ్యవధిలోనే మూడు సార్లు అక్కడ పర్యటించి నేరుగా ప్రజలతో కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అక్కడ ప్రజలకు కావాల్సినవి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనులు కూడా ప్రారంభించారు.
పిఠాపురం అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ అక్కడ పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకునేందుకు మరికొంత భూమిని కొనుగోలు చేశారు. గతంలో 3.5 ఎకరాలు కొన్న పపవన్ కల్యాణ తాజాగా మరో 12 ఎకరాలను కొన్నారు. మంగళవారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జులైనే భోగాపురం రెవెన్యూపరిధఇలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాలు కొన్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మొత్తం 15 ఎకరాల భూమిలో కొంత భాగం పార్టీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం, ఇల్లు నిర్మించుకోవాలని చూస్తున్నారు.
పవన్ కల్యాణ్ గతంలో ల్యాండ్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరా 15 లక్షలపై మాటే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు కొన్న ప్రాంతంలో ఎకరా 20 లక్షలకుపైగా పలుకుతోందని అంటున్నారు. అంటే కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసిన పవన్ కేవలం ఇల్లు, పార్టీ ఆఫీస్ మాత్రమే కడతారా... లేకుంటే వేరే ప్రజావసరాల కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.
గతంలోనే పవన్ కల్యాణ్ భూమి కొన్న ప్రాంతంలో భారీగా జనసేన పార్టీ నేతలు భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు మరోసారి అదే ఊపు అక్కడ కనిపిస్తోంది. దీంతో అక్కడ భూమి ధరలు అమాంతం పెరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు.