Woman Shed Tears After Finding Stolen Bike In Eluru: మట్టితో రైతుకు అనుబంధం. మనవాళ్లు అనుకున్న వారితో మనకే అనుబంధం. ఆ ఫీలింగ్ వస్తువులకు సైతం అతీతమేమీ కాదు. ఎంతో ఇష్టపడి తన కష్టంతో కొనుక్కున్న ఓ వస్తువు పోతే ఆ బాధ ఎవరికైనా వర్ణనాతీతం. ఓ మహిళ రూపాయి రూపాయి పోగు చేసి కష్టపడి ఓ స్కూటీ కొనుక్కుంది. తలసేమియాతో బాధ పడే బిడ్డను దాని మీదే ఆస్పత్రికి తీసుకెళ్లేది. ఈ క్రమంలో అది వాహనమైనా వారి కుటుంబసభ్యుల్లో ఒకరిగానే భావించింది. అయితే, ఓ రోజు స్కూటీ చోరీకి గురి కాగా.. తీవ్ర వేదనతో పోలీసులను ఆశ్రయించింది. చివరకు దాన్ని రికవరీ చేసిన పోలీసులు ఆమెకు స్కూటీని అందించగా భావోద్వేగానికి గురైంది. ఈ ఘటన మంగళవారం ఏలూరులో జరిగింది. ఇంతకూ ఆ స్కూటీతో మహిళ అనుబంధ కథ ఏంటంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరుకు (Eluru) చెందిన ఓ మహిళ రూపాయి రూపాయి పోగు చేసి ఎంతో కష్టపడి ఓ స్కూటీని కొనుక్కుంది. తలసేమియాతో బాధ పడుతున్న తన బిడ్డను ఆ వాహనంపైనే రోజూ ఆస్పత్రికి తీసుకెళ్లేది. అయితే, ఇటీవలే ఆమె స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి నిందితున్ని అదుపులోకి తీసుకుని బైక్ రికవరీ చేశారు. మంగళవారం ఆమెకు స్కూటీని అందించారు. పోలీసులు ఆమెకు బైక్ అందిస్తోన్న సమయంలో మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్కూటీని హత్తుకుని ముద్దాడారు. తన కష్టం తిరిగొచ్చిందని సంబరపడుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కష్టం ఎక్కడికీ పోదని.. ఇలా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
250కి పైగా బైక్స్ రికవరీ
కాగా, గత 3 నెలల్లో ఏలూరు పోలీసులు సుమారు 250కి పైగా బైక్స్ రికవరీ చేశారు. బైక్స్ చోరీలకు పాల్పడుతోన్న ముగ్గురు నిందితులను కలిదిండి, ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 25 బైక్స్ స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ రూ.17,50,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై మొత్తం 16 కేసులు నమోదు కాగా.. 25 బైక్స్ రికవరీ చేసుకున్నట్లు చెప్పారు. బైక్స్ చోరీ కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అభినందించారు. అలాగే, ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు.
Also Read: Kadapa SP Transfer: కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !