Pawan Kalyan stepping towards national politics: అమిత్ షా ఎంపీగా పోటీ చేయమని సూచించారు నేను అసెంబ్లీకే పోటీ చేద్దామనుకుంటున్నా అని..జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ వచ్చినప్పుడు మీడియాతో ఓ సారి చెప్పారు. నిజానికి బీజేపీ పెద్దలు సూచించినది పవన్ కల్యాణ్‌ను కేంద్రంలోకి రమ్మనే. ఎంపీగా అయితే మరింత ఫోకస్ ఉంటుందని అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ ముందు ఇంట గెలవాలనుకున్నారు. అందుకే ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు వస్తున్న జాతీయ స్థాయి ఫోకస్ కారణంగా.. ఇప్పుడు మరోసారి బీజేపీ నాయకత్వం ఆయనను జాతీయ రాజకీయల వైపు రావాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

Continues below advertisement


హిందూత్వ నినాదంతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా పవన్ కల్యాణ్


తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత పవన్ కల్యాణ్ అనూహ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ బాట ఎంచుకున్నారు. వారాహి సనాతన ధర్మ పరిరక్షణ డిక్లరేషన్ ప్రకటించారు. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించి తమిళనాడులోనూ హైలెట్ అయ్యారు. మహారాష్ట్ర ప్రచారంలోనూ హిందూత్వ వాదాన్ని వినిపించారు. జాతీయ మీడియాలో పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. బీజేపీ లైన్‌లో గట్టిగా హిందూత్వ వాదం వినిపించే కూటమి పార్టీ నాయకుడిగా ఆయనకు వచ్చిన పేరు జాతీయ స్థాయిలో ఫోకస్ తెచ్చి పెట్టింది. 


Also Read: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు


నాలుగు రోజుల ఢిల్లీ టూర్ వెనుక ప్రత్యేక ఎజెండా 


డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ గడపలేదు. ఈ సారి మాత్రం..నాలుగు రోజుల పాటు డిల్లీలో ఉండి కేంద్ర మంత్రులతో పాటు ప్రధానితోనూ మాట్లాడారు. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. ఎంపీలకు విందు ఇచ్చారు. జాతీయ మీడియాకూ ఇంటర్యూలు ఇచ్చారు. ఈ టూర్ వెనుక ఖచ్చితంగా ఏదో అంతర్గత ఎజెండా ఉందన్న అభిప్రాయం సహజంగానే రాజకీయవర్గాలకు వస్తుంది. ఎన్డీఏ కూటమి తరపున దక్షిణాది హిందూత్వ ఫేస్‌గా పవన్ కల్యాణ్‌ను ఫోకస్ చేయాలన్న ప్లాన్ లో బీజేపీ ఉందని ఈ దిశగా ఆయనను ఒప్పించేందుకు కసరత్తులు చేస్తోందని అంటున్నారు. 


Also Read: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?


ఆరు నెలల్లో కీలక మార్పులు ఉంటాయా ? 


పవన్ కల్యాణ్‌కు వచ్చిన ప్రత్యేకమైన ఇమేజ్ ఇప్పుడు బీజేపీకి. ఎన్డీఏ కూటమికి ఇతర రాష్ట్రాల్లో కూడా అవసరమని భావిస్తున్నారు. ఆయనతో ఢిల్లీలో ప్రచారం చేయించుకుంటారని అంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆయన హాట్ టాపిక్. అందుకే పవన్ కల్యాణ్ ఆరు నెలల్లో కేంద్రంలో భాగం అవుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలాఉన్నాయో.. పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఉందో లేదో మాత్రం స్పష్టత లేదు. కానీ వచ్చే కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.