Congress is turning into a public opposition in AP:  38 శాతం ఓట్లొచ్చి అసెంబ్లీకి వెళ్లని మీరు 1.7 శాతం ఓట్లు వచ్చిన మాకు పెద్ద తేడా లేదని ఓ సందర్భంలో వైసీపీని ఉద్దేశించి షర్మిల అన్నారు. అయితే తాము వైసీపీ కంటే చాలా మెరుగు అని నిరూపించేందుకు రోజు రోజుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రకరకాల సమస్యలతో వైసీపీ వెనుకబడిపోతూండగా.. ప్రజాసమస్యలతో పాటు రాజకీయ అంశాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ అధికార కూటమిని ఢీ కొడుతున్న ఏకైక నాయకురాలిగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు రాక చాలా కాలం అయింది. ప్రెస్‌మీట్లు పెట్టడం తప్ప పెద్దగా రాజకీయ కార్యకలాపాలేమీ చేపట్టడం లేదు. 


ఇంకా  రాజకీయంగా యాక్టివ్ కాని జగన్


ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఎలా ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అప్పుడే అంత అవసరం ఏముందని అనుకున్నా.. రాజకీయంగా దూకుడుగా ఉన్నామని అనిపించుకోవడానికి వచ్చిన అవకాశాలన్నింటినీ వదులుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా విపక్షంలో ఉంటే అసెంబ్లీకి మించిన పోరాట బరి ఉండదు. కానీ జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని వదులుకున్నారు. కనీసం ఆ కారణం కాకుండా ఇంకో ప్రజాకోణంలో బలమైన కారణం చెప్పినా ప్రజల్ని కన్విన్స్ చేసినట్లుగా ఉండేది. ఓ వైపు పార్టీ కార్యకర్తలను విస్తృతంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ నేతలపై వరుసగా కేసులు పడుతున్నాయి. వీటన్నింటిపై ప్రశ్నించి పార్టీ క్యాడర్ కు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 


Also Read:  అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు


వరుసగా వైసీపీకి సమస్యలు 


ఓ వైపు పార్టీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది. సీనియర్ నేతలు నోరు తెరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి సమయంలో వైసీపీకి వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విచారణలకు తోడు కొత్తగా అమెరికా నుంచి ఓ పిడుగు పడింది. సెకీతో చేసుకున్న ఒప్పందాల విషయంలో జరుగుతున్న ప్రచారం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆ ఇష్యూ వచ్చిన రోజున  అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నికలో ఓటేయాల్సి ఉన్నా ఉదయమే బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయంలో వైసీపీ నేతలు ఎంతగా డిఫెండ్ చేస్తున్నా .. ఆ ఆరోపణలు చేసింది అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ కావడంతో.. వైసీపీ వాదన అంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. జగన్ ఈ అంశంపై ఇంకా మాట్లాడలేదు. 


Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!


దూకుడుగా షర్మిల 


మరో వైపు షర్మిల దూకుడుగా ఉన్నారు. ఆమె సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి అదానీతో డీల్స్ వరకూ అన్నింటిపై అటు చంద్రబాబుపై ఇటు జగన్ పై విరుచుకుపడుతున్నారు. అదానీ డీల్ విషయంలో అటు టీడీపీని, ఇటు వైపీసీని కార్నర్ చేయడానికి ఆమె చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయడం లేదని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు వైసీపీని ఎంత బలహీనం చేస్తే కాంగ్రెస్ అంత బలపడుతుంది. అందుకే జగన్ ను వైసీపీ.. ఒకింత ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఏపీలో వైసీపీ కన్నా ఎక్కువగా కాంగ్రెస్‌నే ప్రజా ప్రతిపక్షంగా పని చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.