BJP rejects Congress claim on EVMs: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి చర్చ ప్రారంభించింది. బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ వాదన తెలిపోతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈవీఎంలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ గెలిచిన చోట అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదు.
గతంలో పేపర్ బ్యాలెట్ తో జరిగిన ఎన్నికలకు ఫలితాలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షలు మల్లికార్జున్ ఖర్గే మీ పార్టీ ఎన్నికల్లో ఓడిన ప్రతి సారీ ఈవీఎం మిషన్లు వద్దు పేపర్ బ్యాలెట్ కావాలి అంటారని విమర్శలు గుప్పించారు. గత హైద్రాబాద్ GHMC 2020 ఎన్నికల ఫలితాలు EVMలతో కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగినవి మీకు గుర్తున్నాయా అని ప్రశ్నించారు.
బ్యాలెట్లతో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 56, బీజేపీ 48 , మజ్లిస్ 44, కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే గెలిచాయన్నారు. మీ వైఫల్యాలకు ఈవీఎంలను నిందించే బదులు, ఈరోజు మీ పార్టీ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉందో అని ఆత్మపరిశీలన చేసుకోకూడదని సలహా ఇచ్చారు. మీ పార్టీ నేత రాహుల్ గాంధీ యొక్క అసమర్థ, బూటకపు అబద్ధాలు ప్రచారం, మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అబద్ధాల ఎన్నికల హామీలు, వైఫల్యాలు మరియు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఇలా పిటిషన్లు వేస్తారా అని ఈవీఎంలపై దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టి వేసింది. విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తు చేశారు.