Police Found Drinkers With Drones In Anantapuram: గంజాయి బ్యాచ్, మందుబాబులు, బ్లేడ్ బ్యాచ్ ఇలా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఏపీ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించి ఎంజాయ్ చేస్తామనుకునే వారికి డ్రోన్లతో (Police Drones) షాక్ ఇస్తున్నారు. ఆ సమయానికి అక్కడ తప్పించుకున్నా విజువల్స్ సాయంతో వెతికి మరీ పట్టుకుంటున్నారు. తాజాగా, అనంతపురం (Anantapuram) జిల్లాలోని శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. బహిరంగంగా జూదం ఆడడం, లిక్కర్ సేవించడం, గంజాయి, కొట్లాటలు వంటి వాటిపై సీరియస్‌గా ఫోకస్ చేశారు. పోలీస్ డ్రోన్లను చూసిన ఆకతాయిలు ఒక్కసారిగా పరుగందుకున్నారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించిన వారిపై 4 కేసులు నమోదు చేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. డ్రోన్లను చూసి మందుబాబులు పరుగులెత్తిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఎస్పీ అమిత్ బర్దార్.. సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. డ్రోన్ సాయంతో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి 5 ఎకరాల్లో సాగు చేస్తోన్న వెయ్యి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అటు, విజయవాడ పోలీసులు సైతం విస్తృతంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. నగర సీపీ ఎస్.వి.శేఖర్ బాబు ఆధునిక పరిజ్ఞానం సాయంతో 'లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్' ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం అప్‌డేటెడ్ వెర్షన్ కలిగిన ఎయిర్ 3 డ్రోన్లను 3 విధాలుగా ఉపయోగిస్తున్నారు. కాగా, విజయవాడ వరదల సమయంలోనూ పోలీసులు డ్రోన్లను సహాయక చర్యల నిమిత్తం విస్తృతంగా ఉపయోగించారు.
Also Read: Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !