Adani Power Deal:  అధికారం పోయి ఇబ్బంది పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమెరికా నుంచి వచ్చి పడిన అదానీ కేసు సమస్యగా మారింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటపడిన దాదాపు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తనకు ఆ కేసు గురించే తెలియదన్నారు. ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. 


అదానీతో భేటీలను రహస్యంగా ఉంచడంతో అనేక ఉహాగానాలు !


ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని గ్రూపు సంస్థల యజమాని గౌతమ్ అదాని పలుమార్లు తాడేపల్లికి వచ్చారు. ప్రత్యేక విమానాల్లో ఆయన వచ్చిన విషయం మీడియా ప్రచారం చేసింది కానీ ఆయన ఎందుకు వచ్చారు.. ఏం చర్చించారు అన్నది అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఫలానా పెట్టుబడుల చర్చల కోసం వచ్చామని ప్రకటించి ఉంటే సమస్యలు ఉండేవి కావు. ఇప్పుడు ఆ సమావేశాల్లోనే విద్యుత్ డీల్ కుదిరిందని అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. ఇప్పుడు మాజీ సీఎం .. తనను అదానీ చాలా సార్లు కలిశారు కానీ విద్యుత్ డీల్స్ కోసం కాదని.. అదానికి ఏపీలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయంటున్నారు. సీఎం హోదాలో పారిశ్రామిక వేత్తతో చర్చలు జరిపిన విషయం బహిరంగంగా ప్రకటించకపోవడం వల్ల ఇప్పుడు అమెరికా కేసు విసృతంగా ప్రచారం కావడానికి కారణం అయింది. 


Also Read: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?


నాటి విద్యుత్ మంత్రి బాలినేనే స్కామ్ జరిగిందని చెబుతున్నారు కదా ! 


తాము అదానీతో ఎలాంటి డీల్స్ పెట్టుకోలేదని నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే అని జగన్ చెబుతున్నారు కానీ ఈ ఒప్పందంలో ఏదో స్కాం ఉందనే తాను సంతకాలు పెట్టలేదని నాటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించారు. రాత్రికి రాత్రి కేబినెట్ ముందుకు తీసుకెళ్లారని..అంతే తప్ప తనకు ఎప్పుడూ ఎవరూ ఎలాంటి వివరాలు చెప్పలేదంటున్నారు. బాలినేని స్వయంగా ఆనాటి మంత్రే కాదు జగన్ సమీప బంధువు కూడా. ఆయన కూడా ఇలాంటి ఆరోపణలు చేయడంతో వైసీపీ ఎంతగా డిఫెండ్ చేసుకున్నా..  బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!


కేసుల పేరుతో బెదిరించడం కన్నా విచారణకు సిద్ధమని ప్రకటిస్తే సవాల్ చేసినట్లుగా ఉండేదా ?


తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమెరికా ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లోతన పేరు లేదని జగన్ చెబుతున్నారు. కానీ పత్రాల్లో  జగన్ పేరు వ్యక్తిగతంగా లేదు కానీ..ఆయనే అని చెప్పేలా పూర్తి సంకేతాలు ఉన్నాయి. ఆ పత్రాల్లో చెప్పినట్లుగా రూ. 1750కోట్లు ఎలా తీసుకున్నారో కూడా తర్వాత విచారణలో బయట పెట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రం తరపున కూడా విచారణ చేయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా పరిశీలన చేస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పరువు నష్టం కేసులు వేస్తానని బెదిరించడం కన్నా.. విచారణ చేయిస్తే సిద్దమని ప్రకటించి ఉంటే.. తన వాదనకు నైతిక బలం వచ్చినట్లు ఉండేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే..  అమెరికాలో కేసు జగన్మోహన్  రెడ్డికి ముందు ముందు చాలా పెద్ద సమస్యలు తెచ్చి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు ఓ అభిప్రాయానికి వస్తున్నాయి.