Has Jagan come close to Congress :  ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలోని  జంతర్ మంతర్‌లో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమికి చెందిన పార్టీలు మద్దతు పలికాయి. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్దవ్ ధాకరే  పార్టీ నేతలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, ముస్లింలీగ్ నేతలు జగన్ కు సంఘిభావం తెలిపిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు జగన్ ధర్నా వద్ద కనిపించలేదు. ఈ పరిణామంతో జగన్ ఇండియా కూటమికి దగ్గరయినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఇండియా కూటమికి దగ్గరయిన జగన్ 


దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకూ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. కీలక సమయాల్లో ఆయన బీజేపీ విధానాలకు మద్దతిస్తూ ఇతర పార్టీలను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు మాత్రం ఇండియా కూటమి సభ్యులే మద్దతు పలికారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి నుంచి కీలక పార్టీలకు చెందిన నేతలు జగన్ ధర్నాకు వచ్చి సంఘిభావం తెలియచేయడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంతో ఆయన ఇండియా కూటమికి దగ్గరయినట్లుగానే భావిస్తున్నారు. 


జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ - తర్వాత ఈడీ కి సిఫారసు - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన


స్పీకర్ ఎన్నిక సమయంలోనూ బీజేపీకే మద్దతు పలికిన జగన్


ఇటీవల స్పీకర్ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రత్యర్థి పార్టీలు ఎన్డీఏలో కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీకే మద్దతు ప్రకటించారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ జరగలేదు. కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని ముందుగానే ప్రకటించారు. జగన్ తీరుపై ఢిల్లీ రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆయనకు ఉన్న అనివార్యతల వల్ల మద్దతు ప్రకటించారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండి కూటమి పార్టీల్ని తనకు మద్దతు తెలియచేయాలని ఆహ్వానించడం  ఆసక్తికరంగా మారింది. 


వైసీపీకి కిలారు రోశయ్య రాజీనామా - ఇక ఉమ్మారెడ్డి కుటుంబం జగన్‌కు దూరమేనా ?


క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రక్రియే                               


ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నందున.. బీజేపీకి మద్దతివ్వడం మంచిది కాదని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తున్నారు. అయితే బీజేపీకి దూరమైతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. అయితే ఇండీ కూటమిలో భాగంగా ఉంటే.. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపులేనని ప్రచారం చేసుకోవచ్చని అది సానుభూతి తెస్తుందన్న అంచనాలతో విపక్ష కూటమిలోకి వెళ్లే దిశగా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీనికి తగ్గట్లుగా జగన్ కు సంఘిభావం తెలిపిన ఇండీ కూటమి నేతలంతా జగన్ ను కూటమిలోకి ఆహ్వానించారు.