Guntur MP candidate Kilaru Roshaiah has resigned from YSRCP  :  గుంటూరు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారు రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మీయులతో సమావేశమై..వైసీపీలో తనకు తీవ్ర అవమానాలు జరిగాయని.. చెప్పుడు మాటలు విని పొన్నూరు ఎమ్మెల్యే సీటును నిరాకరించారని ఆరోపించారు. కిలారు రోశయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా  పోటీ చేసి ధూళిపాళ్ల నరేంద్రను ఓడించారు. 2024లో ఆయనకు జగన్ ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.తనకు ఎంపీ టిక్కెట్ అవసరం లేదని చెప్పినా జగన్ పట్టుబట్టి పోటీ చేయించారు. కానీ మూడున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిలారు రోశయ్య.. వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. 


ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య రాజీనామా                                   


గత ఎన్నికల సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబానికి రెండు టిక్కెట్లు ఆఫర్ చేశారు. గుంటూరు ఎంపీ సీటును మొదట ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణకు ఇచ్చారు. అయితే అక్కడ పరిస్థితి బాగో లేదని ఆయన పోటీ చేయడానికి నిరాకరించారు. తర్వాత కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీగా మార్చి.. పొన్నూరు సీటును అంబటి రాంబాబు సోదరుడికి ఇచ్చారు. గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. చివరికి  రోశయ్య కూడా తనకు గుంటూరు పశ్చిమ స్థానమైనా కేటాయించాలని ఒత్తిడి చేశారు. కానీ చివరికి గుంటూరు ఎంపీగానే  పోటీ చేయాల్సి వచ్చింది. 


వైసీపీ వల్ల తీవ్రంగా నష్టపోయానంటున్న రోశయ్య                             


పార్టీ కోసం ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టుకున్నా.. తనకు ఉద్దేశపూర్వకంగా ఓడిపోయే సీటు ఇచ్చారని కిలారి రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ఆస్తుల్ని చాలా వరకూ పోగొట్టుకున్నానని ఆయన  బాధపడుతున్నారని సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడు వైసీపీలోనే కొనసాగితే.. తన వ్యాపారాలు కూడా పూర్తిగా నాశనమైపోతాయని.. ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లలో పడతానని అనుకుంటున్నారు. అదే సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వయోభారం కారణంగా.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. పార్టీ నాయకత్వం కూడా పట్టించుకోడం మానేసింది. 


ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి                             


ఉమ్మారెడ్డి కుటుంబం అందరూ కలిసే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీకి రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేదా అన్నది ప్రకటించలేదు. కిలారి రోశయ్య ఏ పార్టీలో చేరుతారన్నదానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. రెండు రోజుల కిందట.. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి  గిరిధర్ రావు కూడా వైసీపీకి రాజీనామా  చేశారు.