తెలుగు చిత్ర పరిశ్రమలో నటించడం తనకొక మంచి అనుభూతి ఇచ్చిందని చెబుతోంది ఉత్తరాది ముద్దుగుమ్మ ప్రిషా సింగ్ (Prisha Singh). సోషల్ మీడియాలో తన ఫోటోలు చూసి ఆడిషన్‌కు పిలిచారని, తొలుత తాను ఆ పాత్ర చేయగలనా? లేదా? అని సందేహించినప్పటికీ... చిత్ర బృందం సహకారంతో చేశానని అంటోంది. ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరు? ఏ సినిమా గురించి మాట్లాడుతోంది? అంటే...


'బడ్డీ'తో తెలుగు చిత్రసీమకు ప్రిషా సింగ్!
అల్లు శిరీష్ (Allu Sirish) క‌థానాయ‌కుడిగా నటించిన తాజా సినిమా 'బడ్డీ' (Buddy Movie 2024). దీనికి శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకం మీద కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆగస్టు 2న విడుదల అవుతోంది. ఈ సినిమాతో ప్రిషా సింగ్ తెలుగు తెరకు కథానాయకగా పరిచయం అవుతోంది. సినిమా విడుదల నేపథ్యంలో ఆవిడ చెప్పిన సంగతులు...


ఎయిర్ హోస్టెస్ రోల్ చేశా! ముందు ఆలోచించినా... 
Prisha Singh Role In Buddy Movie 2024: 'బడ్డీ' సినిమాలో తన పాత్ర గురించి ప్రిషా సింగ్ మాట్లాడుతూ... ''నా ఫొటోలు చూసి ఆడిష‌న్‌కు పిలిచారు. యాక్టింగ్ చూసి ఎంపిక చేశారు. అయితే... ఆ పాత్ర‌లోని వేరియేష‌న్స్ చూసి నాకు సందేహం కలిగింది. 'నేను చేయ‌గ‌ల‌నా? లేదా?' అని! ఆలోచించా. 'బ‌డ్డీ'లో నాది ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్. దీని కోసం చాలా మంది రియల్ ఎయిర్ హోస్టెస్‌ను అబ్జర్వ్ చేశా. వారు ఎలా నడుస్తారు? ఎలా మాట్లాడతారు? అని గమనించా. దర్శకుడు శామ్ సార్ సైతం కొన్ని రెఫరెన్సులు ఇచ్చారు. అవి నాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి'' అని చెప్పారు. 'బడ్డీ' తర్వాత తెలుగులో మరిన్ని పాత్రలు చేయడానికి ఎదురు చూస్తున్నారని ఆవిడ చెప్పుకొచ్చారు.


వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే ఇష్టం!
తన పర్సనల్ హాబీస్ గురించి ప్రిషా సింగ్ మాట్లాడుతూ... ''నాకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే ఎక్కువ‌ ఇష్టం. నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ చేస్తే... రీసెంట్‌గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేశా. వైల్డ్ లైఫ్‌ యాత్రికుల‌తో క‌లిసి అడ్డవుల్లోకి వెళ్ళా. అక్కడి స‌ఫారీల్లో జంతువుల‌ను నా కెమెరాల్లో బందించా'' అని చెప్పింది.


Also Read: కేజీఎఫ్ యూనివర్స్‌లోకి అజిత్ - కోలీవుడ్ స్టార్‌తో ప్రశాంత్ నీల్‌ క్రేజీ డీల్


ఇంకా ప్రిషా సింగ్ మాట్లాడుతూ... ''వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే కేవ‌లం అడవుల్లో  చెట్లను, అక్కడి జంతువులను కెమెరాల్లో బంధించ‌టం మాత్ర‌మే కాదు.... వాటి స‌హ‌జ‌మైన భావోద్వేగాల‌ను క్యాప్చర్ చేయడం. నా కెమెరాలో అటువంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసినప్పుడు వచ్చే సంతృప్తి, అనుభ‌వాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రతి ఫోటో వెనుక ఒక బలమైన కథ ఉంటుంది. అది న‌ట‌న ప‌రంగానూ నన్ను మెరుగుప‌రుచుకునేలా చేసింది'' అని చెప్పారు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. 


Also Readహను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?