AP PCC chief Sharmila :  భారీ వర్షాలతో ఏపీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలు తెలుసుకునేందుకు వెళ్లిన షర్మిల సాహసం  చేశారు.  పశ్చిమ గోదావరి జిల్లా  తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగారు. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు సాయం చేయాలనన్నారు.


రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్


నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలు నీటి నునిగాయని షర్మిల చెప్పారు. రైతులు ఇంత తీవ్రంగా నష్టపోతూంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు అందరూ అప్పుల పాలయ్యారని.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. రైతుల కష్టాలను పంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. చంద్రబాబు ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలని డిమండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకూడదన్న నియమం ఎక్కడా లేదన్నారు. గతంలో హామీ ఇవ్వకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి రైతుల్ని ఆదుకోవాలన్నారు.


 భారీగా నీరున్న పొలాల్లోకి దిగి ఆశ్చర్యపరిచిన షర్మిల                        
 
పంట నష్టం పరశీలనకు వచ్చిన  సమయంలో  ఎదురుగా పెద్ద చెరవులా ఉన్న ప్రాంతాన్ని చూసి షర్మిల ఆశ్చర్యపోయారు. అవన్నీ పొలాలేనని..ఆ నీళ్ల కింద వరి పంట ఉందని చెప్పారు. దీంతో తాను అందులోకి దిగి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నడుమెత్తున నీళ్లు ఉంటాయని ప్రమాదకరమని పార్టీ నేతలు చెప్పారు. అయినప్పటికీ.. షర్మిల తాను పొలంలోకి దిగుతానని స్పష్టం చేశారు. దీంతో పార్టీ నేతలు ముందుగా పొలంలోకి దిగిలోతు ఎంత ఉందో చూశారు. కింద నీట మునిగిన వరి పైరును  తీశారు. తర్వాత షర్మిల పొలంలోకి దిగారు. ఆమెకే .. నడుంలోతుపైగా నీరు వచ్చాయి. కాసేపు నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చారు. ఓ రాజకీయ నేత అదీ కూడా మహిళా నేత ఇలా నిరసన వ్యక్తం చేయడం హైలెట్ గా మారింది.                                   


 అసలైన ప్రతిపక్షంగా వ్యవహరించే వ్యూహం                


షర్మిల అసలైన ప్రతిపక్షంగా .. ప్రజల కోసం పోరాడాలన్న వ్యూహంతో ఇలాంటి సాహసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేస్తున్న సమయంలో షర్మిల ఇలా వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల కోసం పోరాటం ప్రారంభించడం యాధృచ్చికం కాదని.. రాజకీయమేనని భావిస్తున్నారు.