CID Investigation In Andhra Liquor Scam : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. జగన్ హయాంలో జరిగిన లిక్క ర్ స్కాం పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఐదేళ్ల కాలంలో అతిపెద్ద స్కాం జరిగిందని సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో కారు. దీనిపై స్పందించిన చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో భయంకరమైన  లిక్కర్ స్కాం జరిగిందని ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 


భారీ స్కాం జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపణ                                       


మద్యం విషయంలో శ్వేతపత్రంలో ప్రకటించిన దాని కంటే ఎక్కువ నష్టం జరిగిందని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రూ. 18వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని ఆయన తేల్చారు. వేలు లంచం తీసుకున్న సాధారణ ఉద్యోగుల్ని శిక్షించగలుగుతున్నామని.. కానీ వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్న వారిని మాత్రం శిక్షించలేకపోతున్నామన్నారు. దేశమంతా ఆన్ లైన్ లావాదేవీలు జరుగూతంటే...ఏపీలో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించారని దీనిపై తాను కేంద్రానికి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఇందులో భారీ స్కాంకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


లిక్కర్ స్కాంపై గతంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపణలు                                       


ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని టీడీపీ, బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో  మద్యం పాలసీ మార్చేశారు. అన్ని దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకు వచ్చారు. దేశంలో దొరికే పాపులర్ బ్రాండ్లేమీ ఏపీలో దొరకలేదు. కొత్త కొత్త బ్రాండ్లు మాత్రమే అమ్మారు. అవన్నీ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి , సజ్జల  కనుసన్నల్లోనే స్వాధీనం చేసుకున్న డిస్టిలరీల్లో తయారు చేసి అమ్మారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ మద్యం అంతా కల్తీయేనని పలుమార్లు ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని ప్రకటించారు. 


సీఐడీ విచారణకు ఆదేశించడంతో కలకలం


చెప్పినట్లుగానే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పై శ్వేతపత్రం ప్రకటించిన వెంటనే్ విచారణకు ఆదేశించారు. పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించినందున.. వాటి వివరాలతో ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిణామాలంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.  


అంతకు ముందు చంద్రబాబు అసెంబ్లీలో ఎక్సైజ్ పై శ్వేతపత్రం ప్రకటించారు. ఈ సందర్భంగా ..  వైసీపీ ప్రభుత్వం లో ఎక్సైజ్ పాలసీపై జరిగిన అనేక అవకతవకలను వెల్లడించారు.