AP government vs Employees :   ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అనే వాతావరణం మళ్లీ ఏర్పడుతోంది.  ఉద్యోగ  సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ సీఎస్‌కు తమ  ఉద్యమ షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమూలుగా కదిలేది కాదని.. ఈ సారి సమ్మెకు అయినా వెళ్తాం కానీ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని అంటున్నారు. గతంలో పీఆర్సీ ఉద్యమ సమయంలో సమ్మె వరకూ వెళ్లారు. కానీపెద్దగా ఏమీ సాధించకుండానే ఉద్యమం విరమించారు. అయితే  అప్పటి  హామీలు ఇంకా నెరవేరలేదని పైగా ఇంకా మోసం చేస్తున్నారని..  ఉద్యోగులు అంటున్నారు. ఒక్క డీఏ ఇవ్వడంలేదని..  జీపీఎఫ్ సొమ్ములు సహా తాము దాచుకున్నవేవీ ఇవ్వడం లేదని అంటున్నారు. అన్నీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 


ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న విమర్శలు ! 


ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు  ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. పీఆర్సీ విషయంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం సాగింది. చివరకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సంతృప్తి కలిగించలేదంటూ ఛలో విజయవాడ పేరుతో భారీ ప్రదర్శన జరిగింది.  ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయులు అసహనంతో కనిపిస్తున్నారు. దానికి తోడుగా వేతనాలు సకాలంలో జమకాకపోవడం మరింత సమస్యగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన జమ అవుతాయనే దీమా ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్కో నెల ఒక్కో రీతిన ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందుతున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి నిధులు దారి మళ్లించారని, ఉద్యోగులు తమ అవసరాల్లో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదనే విమర్శలు కూడా పదే పదే వినిపిస్తున్నాయి. నెలల తరబడి జీపీఎఫ్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘం నేతలపై ఒత్తిడి ! 


ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఆయా సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతోంది. దాంతో ప్రభుత్వంతో పీఆర్సీ సహా వివిధ ఒప్పందాల విషయంలో సానుకూలంగా వ్యవహరించిన నేతలు కూడా ఇటీవల తమ స్వరం పెంచుతున్నారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం అయింది.  జీపీఎఫ్ సహా వివిధ సమస్యలపై జోక్యం చేసుకోవాలని సూర్యనారాయణ గవర్నర్ ను కోరారు.  


ఉద్యోగుల్ోల ప్రభుత్వంపై వ్యతిరేకత !


జీపీఎఫ్ బిల్లులు, డీఏ చెల్లింపు వంటి విషయంలో జరుగుతున్న ఆలస్యం చాలామందిని వేధిస్తోంది. సామాజిక పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తున్న ప్రభుత్వం   ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయంలో కాలయాపన చేస్తూ వేధిస్తోందని ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సీపీఎస్ వంటి సమస్యల నుంచి ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న పరిస్థితులు ఉండటంతో ఉద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేయాల్సిందంతా చేస్తున్నామనే వాదనతో ఉంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరగడంతో ... ఉద్యోగులు ప్రభుత్వంఇక తమను లెక్క పెట్టడం లేదనే అభిప్రాయానికి వచ్చారు. 


ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే.. వారికి ప్రజా మద్దతు లభిస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేక భావం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగుల ఆందోళనలను ఎలా అణిచి  వేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని.. వారివి గొంతెమ్మ కోరికలన్న అభిప్రాయంతో పెద్దలున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే్ అవకాశాలు కనిపిస్తున్నాయి.