నిజామాబాద్ జిల్లాలో రానున్న రెండు నెలల్లో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఇందులో ఒకరు వీజీ గౌడ్, మరొకరు రాజేశ్వరరావు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వీజీ గౌడ్ పదవి పొందగా గవర్నర్ కోటాలో రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ అయ్యారు. రాజేశ్వర్ రావు కాంగ్రెస్ హాయాంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కూడా రాజేశ్వర్ రావుకు రెండు సార్లు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీజీ గౌడ్ కూడా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. వీజీ గౌడ్ పదవీ కాలం ఈ మార్చి నెల చివరి వారంలో ముగియనుంది. రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవీ కాలం ఏప్రిల్ ముగియనుంది. 


దీంతో జిల్లాలో ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుండటంతో ఆశావహులు అధిష్టానం హామీ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలోనే ఉంటూ ఇప్పటివరకు ఎలాంటి పదవులు దక్కని నాయకులు ఈ సారి ఎలాగైనా ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవులను దక్కించుకోవాలనుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్దరు నేతలకు సీఎం కేసీఆర్ వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. మూడోసారి కూడా తమకే దక్కుతుందన్న ధీమాలో ఆ ఇద్దరు నేతలు ఉన్నారు. చాలా కాలం నుంచి ఎలాంటి పదవులు రాక అధిష్టానంపై ఆశలు పెట్టుకున్న నేతలు కూడా తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇప్పటికే మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, గతంలో బీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఉద్యమంలో జిల్లా నుంచి కీలక పాత్ర పోషించిన ఏఎస్ పోశేట్టి లాంటి సీనియర్లు తమకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సీనియర్లు ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఉన్నారు...


వీజీ గౌడ్ బీసీ సామాజిక వర్గం నేత, రాజేశ్వరరావు ఎస్సీ సామాజిక వర్గం నేత. వీరిద్దరికీ రెండు సార్లు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులను ఇచ్చారు. అయితే గత ఎన్నికల సమయంలో జిల్లాలో కొంతమంది పేరున్న లీడర్లు కాంగ్రెస్, టీడీపీని వదిలి బీఆర్ఎస్ లోకి వచ్చారు. వారికి ఇప్పటి వరకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఎస్సి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మధు శేఖర్ చాలా కాలం నుంచి తగిన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న ఆశతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన అరికెల నర్సారెడ్డి గతంలో టీడీపీ హాయాంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశపెట్టుకున్నారని తెలుస్తోంది. కామారెడ్డి నుంచి మైనార్టీ నాయకుడు ముజిబుద్దీన్ సైతం ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలన్న తపనలో ఉన్నట్లు సమాచారం. బోధన్ నియోజకవర్గం నేత గిర్దవార్ గంగాధర్ సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. 


బీఆర్ఎస్ అధిష్టానం మనసులో ఏముంది అనేదానిపై జిల్లా బీఆర్ఎస్ నాయకుల్లో ఆసక్తి నెలకొంది. మళ్లీ మూడోసారి కూడా ఆ ఇద్దరి నేతలకే అవకాశం ఇస్తే ఇన్నాళ్లు పదువుల కోసం ఎదురు చూసిన నేతల్లో వ్యతిరేకత వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ సారి రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవబోతున్నాయ్. మరోవైపు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన మండవ వెంకటేశ్వరరావు కూడా చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. మండవ కూడా చాలా సీనియర్ నేత. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఒక వేళ మండవ సేవలు కావాలనుకుంటే ఆయన వైపు సీఎం కేసీఆర్ మొగ్గుచూపెడతారా అన్న చర్చ కూడా జరుగుతోంది.


ప్రస్తుతం సిట్టింగులకు కాకుండా కొత్తవారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్నదానిపైనా కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జిల్లాలో ఈ ఇద్దరి నేతలతో పాటు కవిత కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం పదవులు ముగియనున్న రెండు ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీని ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు మాత్రం ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇటు సిట్టింగులు మాత్రం పదవులు తమకే దక్కనున్నాయన్న ఆశతో ఉన్నారు. మరి అధిష్టానం మనసులో ఏమున్నదో అన్నదానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.