YSRCP Attacks :  వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. తాము సామాజిక న్యాయం చేశామని అన్ని వర్గాలకూ అధికారం అందేలా చూస్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. బలహీనవర్గాలకు టీడీపీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది.. తాము ఎన్ని ఇచ్చామో ఆయన వివరించారు. తర్వాత అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కానీ వైఎస్ఆర్‌సీపీ చేసిన సామాజిక న్యాయం గురించి ఎక్కడా ప్రచారంలోకి  రాలేదు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో దాడి జరగడం సంచలనం అయింది. దాడి సమయంలో తాను అక్కడే ఉన్నానని స్వయంగా వంశీ మీడియాకు చెప్పడం వివాదాస్పదమయింది. ఆ తర్వాత గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిణామాలు అధికార పార్టీకి మేలు చేస్తాయా ? ప్రతిపక్ష పార్టీని బలహీనపరుస్తాయా ? 


విమర్శలు చేసినందుకు దాడులు చేశామన్న ఎమ్మెల్యే వంశీ !


గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సహజం. కానీ ఆరోపణలుకు  ప్రతిగానే తాము దాడులు చేశామన్నట్లుగా వల్లభనేని వంశీ కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ నేరుగానే ప్రకటించారు. అయితే రాజకీయ ఆరోపణలు చేసుకోవడం ప్రజాస్వామ్యం కానీ ఇలా దాడులు చేయడం మాత్రం చట్ట విరుద్ధం. కారణం ఏదైనా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి దృశ్యాలు, పోలీసులు కూడా పెద్దగా అడ్డుకోలేకపోవడం వంటివి సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ హైలెట్ అయ్యాయి. 


తరచుగా టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులు !


తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైనే గతంలో దాడి చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా హైలెంట్ అయింది. ఓ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపైనే దాడి చేస్తున్నా అదీ డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా ఆపలేకపోవడంపై.. పోలీసుల వైఫల్యంపై చర్చ జరిగింది. తర్వాత టీడీపీ నేత పట్టాభి ఇంటిపైనా రెండు సార్లు దాడి జరిగింది. పలు చోట్ల టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. విజయవాడలోనే వైఎస్ఆర్‌సీపీ దేవినేని అవినాష్ ను ఓ సమస్య విషయంలో గడప గడపకూ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ మైనార్టీ మహిళపై దాడులు  చేశారు. ఆ వివాదంలో కేసులు కూడా బాధితులపైనే పెట్టారన్న విమర్శలు వచ్చాయి. ఇలా కేసుల భయంలో ఓ మైనార్టీ మహిళ గుండెపోటుతో మరణించారు. ఇక టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదమవుతోంది. తూ.గో జిల్లా పర్యటనలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. 


ప్రజల్లో భయాందోళనలు కలిగితే అధికార పార్టీకే నష్టం !


అధికార పార్టీ కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడితే.. పోలీసులు అదుపు చేయలేకపోతే.. శాంతిభద్రతల సమస్య ఉందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తారు. ప్రజల్లో ఇలాంటి భయాందోళనలు ఏర్పడితే ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు చాలా సంయమనంతో ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా  వీలైనంతగా కామ్ గా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి పరిణామాలు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. పాలనలో విఫలమయ్యారని.. లా అండ్ ఆర్డర్ ను కాపాడలేకపోయారని  అంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు.. ఎమ్మెల్యేలు అలాంటి భయాలు పెట్టుకోవడం లేదు. ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉందన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. 


సామాజిక న్యాయం అనే అంశాన్ని గట్టిగా ప్రచారం చేసుకునే అవకాశం మిస్ 


గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఆవేశపడటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం .. తాము చేసిన సామాజిక న్యాయం అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాన్ని కోల్పోయిందని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ దాడి ఘటనకే విస్తృత ప్రచారం లభిస్తుంది. మీడియా, సోషల్ మీడియాల్లో అదే హైలెట్ అవుతుంది. దీని వల్ల ప్రజల్లో లా అండ్ ఆర్డర్ పై సందేహాలు ప్రారంభమవుతాయి...కానీ సామాజిక న్యాయం చేశామన్న అధికార పార్టీ నేతల్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. ప్రజలు ప్రశాంతంగా బతకగలమనే ఓ నమ్మకాన్ని ప్రభుత్వాల నుంచి ఆశిస్తారు. ఆ తర్వాతే తమ సామాజికవర్గాలకు చేసిన న్యాయంపై దృష్టి పెడతారు. ఎలా చూసినా వైఎస్ఆర్‌సీపీ నేతల దాడుల రాజకీయం దారి తప్పుతోందన్న అభిప్రాయం ఎక్కువగా సామాన్యుల్లో వినిపిస్తోంది.