Srikakulam Nartu Ramarao :   స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి వైఎస్ఆర్‌సీపీ  తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్‌కు  తెరపడింది.  పార్టీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛా పురం నియోజకవర్గంలో వైకాపాలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నర్తు రామా రావు పేరును వైకాపా తరఫున స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అధిష్టానం ప్రకటించింది.  యాదవ, తూర్పుకాపు, రెడ్డిక సామాజిక వర్గాల్లో ఒక దానికి ఎమ్మెల్సీ కేటాయిస్తారని ముందునుంచే ప్రచారం జరిగింది. ఓ దశలో శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎం. వి. పద్మావతి పేరు బలంగా వినిపించింది. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరికివారు అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేశారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పాలిన శ్రీనివాస్ కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఉత్తరాంధ్ర సమన్వయకర్త బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కోరారు. 


2019 ఎన్నికలకు ముందు వరకు ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్తగా ఉన్న రామా రావును ఎలక్షన్ దగ్గరలో తప్పించారు. ఆ సీటును సాయిరాజుకు కట్టబెట్టారు. వైకాపా అధి కారంలోకి వస్తే మండలికి పంపిస్తామని అప్పుడే రామారావుకు జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివా స్లను మండలికి పంపించారు. స్థానిక సంస్థల కోటాలో యాదవులకు అవకాశం ఇవ్వాలని భావించిన జగన్ గతంలో రామారావుకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. స్థానిక సంస్థల్లో వైకాపాకు తిరుగులేని ఆధిక్యం ఉంది. దీంతో రామారావు ఎన్నిక లాంఛనమే.
 
నర్తు రామారావుకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది.  పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసినా ఓడిపోయారు.  1990ల నుంచి రామారావు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.   ధర్మాన సోదరులకు రామారావు అత్యంత సన్నిహితుడు. 2004లో కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్. పాదయాత్ర వల్ల ఓ వేవ్ వచ్చింది. ఆ ఎన్నికల్లో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే టిక్కెట్ రామారావుకు దాదాపు ఖరారైంది. అయితే చివరి నిమిషంలో లల్లూను టిక్కెట్ వరించడంతో అతడి గెలుపుకోసం రామారావు పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి 2004లో ఇచ్ఛాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 2009లో రామారావుకు టిక్కెట్ వచ్చినా ఓడిపోయారు. 2014లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైకాపా నుంచి రామారావు పోటీ చేసినా విజయం ఆయనను వరించలేదు. 2019 ఎన్నికలకు ముందు రామారావును తప్పించి మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్  బరిలోకి దిగినా పాత ఫలితాలే పునరావృతమయ్యాయి.  


జిల్లాలో యాదవుల సంఖ్య గణనీయంగా ఉంది. రెండు, మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో యాదవులు ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించలేదు. నర్తు రామారావు రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసినా ఆయనను విజయం వరించలేదు.   జిల్లా నుంచి తొలిసారి యాదవ సామాజికవర్గ వ్యక్తిని మండలికి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన పాలిన శ్రావణికి ఇప్పటికే జడ్పీ వైస్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు.   వైకాపా అధికారంలోకి వస్తే కళింగకోమట్లకు ఎమ్మెల్సీ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల కోటాలో తమకు అవకాశం లభిస్తుందని కళింగకోమట్లు భావించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది.