South India :  కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల  బిల్లును తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా అందులో పెట్టిన  షరతు... నియోజకవర్గాల పునర్విభజన తరవాత అమలు చేయడం.  దీంతో  ఈ నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది.   ఇదే జరిగితే  దక్షిణాది పరిస్థితి ఏమిటన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.  దేశంలో జనాభా పెరిగిపోతోందని  జనాభా నియంత్రణను మన ప్రభుత్వాలు చేపట్టాయి. జనాభాను నియంత్రించిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రజలు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా  దక్షిణాదిలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి తగ్గింది.  అభివృద్ధిలో ముందుకు వెళ్లింది. కానీ ఉత్తరాదిలో జనాభా పెరుగుదల నిష్పత్తి తగ్గలేదు... అక్కడి ప్రజలు జనాభా నియంత్రణ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే.. నష్టపోయేది దక్షిణాది. లాభపడేది ఉత్తరాది. 


జనాభా ప్రకారం చూస్తే దక్షిణాదికి కోత పడనున్న లోక్ సభ సీట్లు 
 
జనాభా లెక్కల ఆధారంగా చేసే లోక్‌ సభ నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రా ష్ట్రాలపై వేలాడుతోంది. మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించిన తరువాత జరిగే తొలి జనగణన తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి.. మహిళా రిజర్వేషన్‌లను అమలు జరుపుతామని హోమ్ మంత్రి అమిత్ షా బుధవారంనాడు లోక్‌సభలో చెప్పారు. దీంతో.. మళ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది. జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి.   ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి.  జనాభా లెక్కలు తీసిన తర్వాత  పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోతుంది.  ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది.  ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుంది. పశ్చిమబెంగాల్, ఒడిషా కూడా భారీగా నష్టపోతాయి.   ప్రసుతం ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 42 లోక్‌సభ స్థానాలుంటే.. కొత్తగా జరిగే పునర్విభజన తరువాత వాటి సంఖ్య 34కు పడిపోయే అవకాశం ఉంది.  


లోక్‌సభ సీట్లు పెంచితే.. ఉత్తరాదికి ఇంకా లాభం !
 
దేశ జనాభా 140 కోట్లకు చేరినందున వారికి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య కూడా పెరగాలని కోరుకుంటున్నారు. అందుకే జనాభా ప్రాతిపదికిన విభజించి 846 నియోజకవర్గాలు చేయాలన్న ఆలోచన ఉంది. అలా చేస్తే..  ఒక్క యూపీకే 143 లోక్ సభ సీట్లు వస్తాయి.  మొత్తం దక్షిణాదికి 160  వరకూలోక్ సభ సీట్లు ఉంటాయి.  అంటే...  మొత్తం దక్షిణాది.. యూపీ పాటి చేయదన్నమాట. దీంతో పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిపోవడం ఖాయం. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోకూడదని డిమాండ్ చేస్తున్నాయి.  దేశంలో జనాభాను నియంత్రించడంలోనే కాకుండా మానవ అభివృద్ధి సూచికల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానం లో ఉన్నాయి.  


డీ లిమిటేషన్ సున్నితమైన అంశం 
 
జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు జరిపినందుకు దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతుండగా.. జనాభా నియంత్రణలో పూర్తిగా విఫల మై.. జనభా విస్ఫోటంతో నానా అవస్థలు పడుతు న్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం లబ్ధి పొందడం వైచి త్రి కాకమరేమిటి అని దక్షిణాది రాష్ట్రాల నేతలు మండిపడుతున్నారు.  నియోజకవర్గాల పునర్విభజనకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రు. రెండు రోజుల కిందట కేటీఆర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇవ్వాలంటూ ప్రధాని మోడీని డిమాం డ్ చేస్తున్నారు.   నియోజకవర్గాల పునర్విభజన కత్తి మీద సాములాంటిది. ఇది ఎన్నో కీలక రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.