Ayyanna Patrudu: ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీలో ఉండే కొందరు సీఎం జగన్ రెడ్డికి తొత్తులుగా మారారని, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఎప్పుడూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తామే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. జైలు పక్షి జగన్ రెడ్డి వచ్చాక రాజకీయాలు మొత్తం దారుణంగా తయారయ్యాయని అన్నారు. 


‘సంస్కారం ఉన్న వారెవరూ అలా మాట్లాడరు’
కొడాలి నానికి ప్రజల గురించి, రాష్ట్రం గురించి తెలియదని, సంస్కారం ఉన్నవారెవరూ నానిలా దిగజారి మాట్లాడరని  అయ్యన్న పాత్రుడు అన్నారు.  నానీ నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఆడవాళ్లే చెప్పులతో కొట్టే రోజు వస్తుందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి గ్రామగ్రామాన కులాలు, మతాలకు అతీతంగా జరుగుతున్న నిరసనలు, ధర్నాలు నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కమ్మకులం నానిని చూసి సిగ్గుపడుతోందన్నారు. జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఇంత స్పందన వచ్చిందా? ప్రజల కోసం చంద్రబాబు పని చేశాడు కాబట్టే ఆయనకు ప్రజల మద్ధతు లభిస్తోందన్నారు. 


అక్రమంగా కేసులు
వ్యవస్థల్ని గుప్పెట పెట్టుకొని అక్రమ కేసులతో చంద్రబాబుని జైలుకు పంపారని మండిపడ్డారు. లోకేష్‌పై రింగ్ రోడ్డు కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నారని అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్, చంద్రబాబుని జైల్లో పెట్టి శునకానందం పొందుతున్నాడని అన్నారు. లోకేశ్, చంద్రబాబు, ప్రజలు ఒకవైపు ఉంటే జగన్ రెడ్డి, అతని పార్టీ మాత్రమే దిక్కుతోచని స్థితిలో మరోవైపు ఉందన్నారు. ప్రజలకు నిజంగా మంచి చేశానని జగన్ అనుకుంటే ఇప్పుడు పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా జగన్ జనంలోకి  వస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని అన్నారు.


‘జగన్‌కు రాజకీయ సమాధి’
జగన్ జనాన్నిచూసి ఎంత జడుసుకుంటున్నావో ఇక్కడే అర్థమవుతోందని అయ్యన్న విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తే తనకు రాజకీయ సమాధి కడతారని జగన్‌కు కూడా తెలుసని, అందుకే దాక్కొని తిరుగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ లేకపోతే ఉంటే టీడీపీ ఉండదనే పగటి కలలు కనడం మానుకో జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని, చంద్రబాబు ఖాతాకు, ఆయన కుటుంబసభ్యుల ఖాతాలకు ఒక్క రూపాయి వచ్చినట్లు నిరూపించలేకపోయారని అన్నారు.


‘పగటి కలలు వద్దు జగన్’
చంద్రబాబు మాదిరే లోకేష్‌ను కూడా తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి జైలుకు పంపితే టీడీపీ ఉండదని జగన్ పగటి కలలుకంటున్నాడని అయ్యన్న విమర్శించారు. జగన్ ఆలోచనలు.. ప్రభుత్వ విధానాలు ఎంత మాత్రం ప్రజామోదయోగ్యం కాదని, ఆ విషయాన్ని జగన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. టీడీపీకి ఉన్న 70 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు రోడ్లపైకి వస్తే, వైసీపీ ప్రభుత్వం, వాళ్లకు ఊడిగం చేస్తున్న వ్యవస్థలు ఏవీ నిలవలేవన్నారు. చంద్రబాబు నాయకుడి ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.


‘జగన్‌కు ప్రజలు ఘోరీ కడతారు’
వచ్చేవారం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పి, అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే జగన్ రెడ్డి ప్రభుత్వానికి రాజమహేంద్రవరం వంతెన మరమ్మతులు గుర్తొచ్చాయన్నారు. యువగళం పాదయాత్ర రాజమహేంద్రవరం వంతెన పైనుంచి వెళ్లకూడదని ఇలా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రజా మద్ధతుతో జరిగే యువగళాన్ని ఆపితే వైసీపీ ప్రభుత్వం తన గొయ్యి తాను తవ్వు కున్నట్టేనని హెచ్చరించారు. ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగితే సమస్యలు వస్తాయని 144 సెక్షన్ పెట్టేవారని, కానీ జగన్ రెడ్డి వచ్చాక ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే 144 సెక్షన్ అమలవుతోందని అయ్యన్నపాత్రుడు అన్నారు.