AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మరోసారి తనలోని మనవత్వాన్ని చాటుకున్నారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఆగమేఘాలపై ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేయించారు. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కోసం హెలికాప్టర్ ద్వారా గుండె తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో పాటు హెలికాప్టర్‌లో గుంటూరు నుంచి తిరుపతికి అధికారులు గుండె తరలించారు. తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను అమర్చుతున్నారు. అందుకోసం ప్రస్తుతం వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు. ఒక రోగి కోసం హెలికాప్టర్‌లో గుండె తరలించేలా ఏర్పాట్లు చేయించిన సీఎం జగన్‌ చొరవకు రోగి కుటుంబసభ్యులు ధన్యవాదాలు చెబుతున్నారు.
 
గుంటూరు చెందిన 19 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా..  రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది.  ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న అతడికి అవయవాలు దానం చేసేందుకు  కట్టా కృష్ణ కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. అయితే గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తీసుకురావాల్సి ఉంది. అత్యవసరంగా తరలించాల్సి ఉండటంతో రోడ్డు మార్గంలో తీసుకువెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఎమర్జెన్సీ కావడంతో రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుంది. ఈ విషయం అధికారుల ద్వారా సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన జగన్.. గుండె తరలించేందుకు వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.


జగన్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆగమేఘాలపై హెలికాప్టర్ ఏర్పాటు చేసి గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలించారు. గుంటూరు నుండి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి  'గుండె' చేరగా.. రోగికి ప్రస్తుతం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స కొనసాగుతోంది. అతడిని బ్రతికించేందుకు జగన్ చూపించిన చొరవకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించడంపై కుటుంబసభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సాయాన్ని ఎప్పటికి మర్చిపోలేమని, జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని రోగి తరపు కుటుంసభ్యులు, బంధువులు చెబుతున్నారు. ఇక యువకుడి కిడ్నీలను విజయవాడ, విశాఖపట్నంకు తరలించినట్లు తెలుస్తోంది.  యువకుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన అతడి కుటుంబసభ్యులను అందరూ మెచ్చుకుంటున్నారు.



ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పేదలకు కేవలం కార్పొరేట్ వైద్యం అందించడమే గాక.. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయని అద్భుతాలు తన మంచి హృదయంతో చేయగలనని జగన్ చాటి చెప్పారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  కాగా గతంలో పలుమార్లు ఆపదలో ఉన్నవారికి తక్షణ సాయం అందించి జగన్ తన మంచి మనస్సును చాటుకున్నారు. జిల్లాల పర్యటన సమయంలో సాయం కోసం తన వద్దకు వచ్చినవారితో మాట్లాడి వారితో అవసరమైన ఆర్ధిక సహాయం వెంటనే అందించాల్సిన అధికారులను ఆదేశించారు.