TTD News: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వ‌ర‌కు కన్నుల పండుగగా సాగాయి. చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన చక్రస్నాన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.  8 రోజుల్లో శ్రీవారిని 5.47 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్క గరుడసేవ రోజే  72,650 మంది భక్తులు దర్శించుకున్నారు. గరుడ సేవలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఎనిమిది రోజుల్లో మొత్తం లడ్డూలు 30.22 లక్షలను టీటీడీ విక్రయించింది. అలాగే ఎనిమిది రోజుల్లో రూ.24.22 కోట్ల హుండీ కానుక‌లు వచ్చాయి. 2,770 సీసీటీవీలు, 5 వేల‌ మంది టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు బందోబ‌స్తు నిర్వహించారు. చిన్నపిల్లలు త‌ప్పిపోకుండా 6 వేల చైల్డ్ ట్యాగ్‌లు క‌ట్టారు. 2.07 లక్షల మంది భక్తులు స్వామీ వారికి తలనీలాలు సమర్పించగా, 1150 మంది క్షురకులు 11 కల్యాణకట్టల్లో భక్తులకు తలనీలాలు తీశారు.


గ‌దుల కేటాయింపు ద్వారా రూ.1.69 కోట్ల ఆదాయం లభించింది. బ్రహ్మోత్సవాల్లో గ‌దుల ఆక్యుపెన్సీ - 80 శాతం పెరిగింది. బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 16.28 లక్షల భోజనాలు, అల్పాహారం అందించగా, గరుడసేవ నాడు 4.81 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.37 లక్షల మందికి టీ, కాఫీ, పాలు, 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరును టీటీడీ అందించడం జరిగింది. 40 మంది డాక్టర్లు, 35 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించగా, 31 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు అందించారు. తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 3 వేల మంది సిబ్బంది, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 774 మంది సిబ్బంది ఏర్పాటు చేశారు.


దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేయగా, తిరుమ‌ల‌లో 9 వేల వాహ‌నాల‌కు స‌రిప‌డా పార్కింగ్, చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 368 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం వినియోగించగా, శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ వసతి కల్పించింది. తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్ల‌తో పాటు గ‌రుడ సేవ‌నాడు 20 పెద్ద డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ప‌శ్చిమ‌బెంగాళ్‌, రాజ‌స్థాన్  క‌లిపి 12 రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 152 కళాబృందాల్లో 3,710 మంది కళాకారులు 52 క‌ళారూపాల‌ను ప్రద‌ర్శించారు. 


శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్లు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శనలు చేశారు. 45 టన్నులు పుష్పాలు, 3 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 75 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన 3,342 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించారు. ఇక ఏపీఎస్‌ ఆర్‌టీసీ తిరుపతి నుంచి తిరుమలకు 13,352 ట్రిప్పుల్లో 3.25 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 12,977 ట్రిప్పుల్లో 3.69 లక్షల మంది భక్తులను చేరవేశాయి. గరుడసేవనాడు ఆర్టీసీ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2491 ట్రిప్పుల్లో 73,460 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2400 ట్రిప్పుల్లో 56,491 మంది భక్తులను చేరవేశాయి.