Tirupati Crime News: కుమార్తె ఆపరేషన్ కోసం వచ్చి ఓ వ్యక్తి ఆసుపత్రి బయటే మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతుడి భార్య చెల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెంకు చెందిన మన్నసముద్రం చెల్లారెడ్డి, చెల్లమ్మ దంపతులు. వీరికి కుమార్తె పోలమ్మ ఉంది. అయితే ఆమెకు చాలా కాలం క్రితమే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఫుట్టారు. అయితే తాజాగా పోలమ్మ పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేయించుకునేందుకు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.


ఆమెకు తోడుగా ఉండేందుకు తల్లిదండ్రులు.. చెల్లారెడ్డి, చెల్లమ్మలు కూడా అక్కడికి వచ్చారు. అయితే కూతురు సవ్యంగా ఆపరేషన్ జరిగింది. మంగళవారం రోజు రాత్రి సమయం కావడంతో మగవారిని ఆసుపత్రిలో ఉండవద్దని ఆసుపత్రి సిబ్బంది చెల్లారెడ్డిని బయటికి పంపించారు. దీంతో అతడు ఏదైనా అవసరం వస్తే సమస్య వస్తుందని భావించి ఇంటికి వెళ్లకుండా.. గేటు దగ్గర ఉన్న కాలువపైనే పడుకున్నాడు. అదే విషయాన్ని భార్యకు కూడా చెప్పాడు. 


అయితే నిద్రమత్తులో ఉన్న చెల్లారెడ్డి అర్ధరాత్రి కాలువలో పడిపోయాడు. లోపల బురద ఎక్కువగా ఉండడంతో... అందులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం కాగానే భర్త పడుకున్న చోటుకు వచ్చి చూసిన చెల్లమ్మకు అతడు కనిపించలేదు. దీంతో అక్కడంతా వెతికింది. చివరకు కాలువలో ఉన్న భర్తను గమనించింది. అందరికీ సమాచారం అందించి బోరున విలపించింది. స్థానికులంతా మురికి కాలువలో పడిపోయిన చెల్లారెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమార్తె ఆపరేషన్ కోసం అంటూ వచ్చి మృతి చెందడంతో మృతుడి బంధువుల ఆర్తనాదాలతో  హాస్పిటల్ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య చెల్లమ్మ అయితే భర్త మృతదేహాన్ని పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 


మరోవైపు చిత్తూరులో విద్యార్థిని అనుమానాస్పద మృతి


చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కావూరివారిపల్లె పంచాయతీ, వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ(16) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే భవ్యశ్రీకి గజేంద్ర, కుమార్ అనే ఇద్దరూ యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఈ నెల 16వ తేదీ నుంచి భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల ప్రాంతం అంతా గాలించారు. కానీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ పాత బావిలో యువతి మృతిదేహం ఉన్నట్లు వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వెళ్ళిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి యువతి మృతిదేహాన్ని బయటకు తీయగా.. భవ్యశ్రీగా గుర్తించారు. శాంపుల్స్ సేకరించి వాటిని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ పంపి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. జట్టు కనిపించకపోవడంతో భవ్యశ్రీ తల శిరోముండం చేసినట్లుగా తల్లిదండ్రులు భావించారు. భవ్యశ్రీ ధరించిన లెగిన్స్ లేకపోవడం, నాలుక కొరికినట్లుగా ఆనవాళ్ళు ఉండడంతో అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని ఆరోపించారు.