Medak News: ఇంట్లో పండుగ. ఇంటి పెద్దాయన బంధువులందరినీ పిలిచాడు. బావమరుదులు, ఆడబిడ్డలు, వారి పిల్లలు అందరని ఆహ్వానించాడు. అందరూ కలిసి పండుగ సంతోషంగా జరుపుకున్నారు. ఇంక ఎవరి ఇళ్లకు వారు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ ఇంట్లోని మహిళలు దుస్తులు ఉతుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అదే వారి పాలిట మృత్యుపాశమైంది. వారితో పాటు వచ్చిన పదేళ్ల బాలుడు నీట  మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు మహిళలు నీట మునిగి మృత్యువాత పట్టారు. వారి మృతదేహాలను చూసి ఇంటి సభ్యుల రోదన వర్ణణాతీతం. పండుగకు పిలిచి ఇంత మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నానే, మిమ్మల్ని పిలవపోయిన బతికి ఉండేవారు అంటూ గుండెలు పగిలేలా రోదించారు. ఇది చూసిన స్థానికులు సైతం బోరుమంటూ విలపించారు.


మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లి గ్రామంలో జరిగింది. బాలుడి ఆచూకీ లభించలేదు. మనోహరాబాద్‌ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, స్థానికులు వివరాల మేరకు.. రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంట్లో ఆదివారం బోనాల పండగ నిర్వహించారు. ఇందుకు సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అంబర్‌పేటకు చెందిన తన బావమరుదులు దొడ్డు యాదగిరి, దొడ్డు శ్రీకాంత్‌ల కుటుంబాన్ని ఆహ్వానించారు. ఆదివారం కుటుంబం మొత్తం పండుగను సంతోషంగా జరుపుకున్నారు. అందరూ సొంత ఊర్లకు వెళ్లాల్సింది. 


ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉండంతో దుస్తులు ఉతికేందుకు సోమవారం దగ్గలోని చెరువు వెద్దకు వెళ్లాలని అనుకున్నారు. యాదగిరి భార్య బాలమణి(35), వీరి కుమారుడు చరణ్‌ (10), శ్రీకాంత్‌ భార్య లక్ష్మి (30), ఫిరంగి చంద్రయ్య భార్య లక్ష్మి, వీరి కుమార్తె లావణ్య(18)లు దుస్తులు ఉతికేందుకని గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లారు. చరణ్‌ నీటిలో దిగి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో మునిగిపోయాడు. గమనించిన బాలుడి తల్లి బాలమణి కుమారుడిని కాపాడేందుకు చెరువులో దూకింది. ఆమెకు ఈత రాకపోవడంతో నీట మునిగింది. వారిద్దరిని రక్షించేందుకు దొడ్డు లక్ష్మి, లావణ్య సైతం నీటిలోకి దిగారు. అయితే వారికి కూడా ఈత రాకపోవడంతో వారు సైతం నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న చంద్రయ్య భార్య ఫిరంగి లక్ష్మి వారిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 


వారి అరుపులు విన్న స్థానికులు చెరువు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫిరంగి లక్ష్మిని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దొడ్డు లక్ష్మి, దొడ్డు బాలమణి, ఫిరంగి లావణ్య మృతదేహాలను బయటకు తీశారు. చరణ్‌ మృతదేహం కోసం గాలిస్తున్నారు. బోనాల పండగ రోజు ముగ్గురు మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగకు పిలిచి ప్రాణాలు తీశానే అంటూ చంద్రయ్య, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచి వేశాయి. ప్రమాద స్థలాన్ని తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరి, సీఐ శ్రీధర్‌ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.