is One Nation One Election Possible : ‘ఒక దేశం – ఒకే ఎన్నికలు’ అనేది బీజేపీ లక్ష్యం. మూడో సారి అనుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు వచ్చి ఉన్నట్లయితే.. ఈ పాటికి రాజ్యాంగ సవరణలు కూడా జరిగిపోయే ఉండేవి. కానీ మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన రాజకీయం వచ్చింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ఇబ్బంది. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం అని అర్థం చేసుకోవచ్చు.
జమిలీ ఎన్నికలపై మోదీ వ్యూహం ఏమిటి ?
గత లోక్ సభ ఎన్నికలకు ప్రకటనకు ముందు జమిలీ ఎన్నికలపై కాస్త హడావడి జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం నియమించింది. వెంటనే ఆ కమిటీ పని కూడా ప్రారంభి ..ప్రాథమిక నివేదికను మార్చి 15న నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. మూడో సారి అధికారం చేపట్టగానే ప్రధాని మోదీ నూతన ప్రభుత్వానికి నిర్దేశించిన తొలి 100 రోజుల ఎజెండాలో జమిలీ ఎన్నికలు కూడా భాగమే. కానీ వంద రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు కానీ తాము కట్టుబడి ఉన్నామని మాత్రం ప్రకటించారు. అందుకే మరోసారి చర్చ ప్రారంభమయింది.
ప్రతి సందర్భంలో ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ దుస్తులు, ఆయన ఎక్కడ కొంటారంటే ?
కోవింద్ కమిటీ సిఫార్సులు జమిలీకి అనుకూలం
కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో జమిలీ ఎన్నికలకు అనేక సిఫారసులు చేసింది. ముందుగా లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సూచనలు చేసింది. లా కమిషన్ కూడా రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించాలని సూచించే చాన్స్ ఉందని ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. 2029 నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేయనుందని అంటున్నారు. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో మొదటి ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఈ ఐదేళ్లలో శాసనసభ ఎన్నికలను సర్దుబాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అనేక సమస్యలు
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు జరిగితే అనేక సమస్యలు వస్తాయి. అవిశ్వాసం కారణంగా ప్రభుత్వం పతనమైతే లేదా హంగ్ ఏర్పడితే ఏం చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే మిగిలిన సభ వ్యవధిలో తాజా ఎన్నికలు నిర్వహించాలన్నది మరో సూచన. జమిలీ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు నేరుగానే వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికే పెడుతున్నారనేది ఆయా పార్టీల వాదన. అందుకే వాటి వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు సాధ్యం కావు.
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
బీజేపీకి రెండు సభల్లోనూ అంతంతమాత్రమే మెజార్టీ
రాజ్యాంగపరమైన అవగాహన, ప్రస్తుత రాజకీయాలపై అంచనా ఉన్నవాళ్లు... ఒక్క రాజ్యాంగ సవరణ చేయాలన్నా ప్రస్తత ప్రభుత్వానికి చాలా కష్టమని అర్థం చేసుకుంటారు. మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ అన్ని పార్టీలను ఎలా ఒప్పంచాలో బీజేపీకి తెలుసని కొంత మంది వాదన. అసలు ఈ అంశంపై ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారన్నది కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.