PM Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ ఆయన ఆయా దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలతో పాటు ఆయన ధరించే దుస్తులు కూడా చాలా హైలైట్ అవుతుంటాయి. విదేశీ పర్యటనలనే కాదు.. దేశంలో జరిగే వివిధ కార్యక్రమాలకు వివిధ డ్రెస్సుల్లో ఆయన దర్శనిస్తుంటారు. ఆయన వేసుకునే బట్టలపై ఒక్కోసారి విపక్షాలు రాజకీయం కూడా చేస్తుంటాయి. ఈ మంగళవారం ( సెప్టెంబర్ 17) నాడు ఆయన 74వ పడిలోకి అడుగు పెట్టిన తరుణంలో ఆయన ధరించిన దుస్తులు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. ఆయన ఎక్కడ కొంటారా అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఆహార్యంతోనే ప్రపంచ యవనికపై మోదీకి ప్రత్యేకమైన గుర్తింపు:
అందరి దృష్టిని ఆకర్షించే ఆయన దుస్తులు ఎక్కడ కొంటారో తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఆయన నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ.. మొదటి నుంచి ఆయన వస్త్రాలకు ఇతర అవుట్‌ఫిట్‌లకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తారు. ఆయన వేసుకునే కుర్తా, పెట్టుకొనే కళ్లజోళ్లు, జేబులో పెట్టుకునై పెన్నులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముందుగా ఆయన తన ఆహార్యంతోనే ప్రపంచ యవనికపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనడంలో అతిశయోక్తి కాదు. మోదీ ధరించే ఖరీదైన దుస్తులు పెన్నులకు సంబంధించి ఎప్పుడూ దేశంలో కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుంది. అనేక మంది రైట్ టూ ఇన్‌ఫర్‌మేషన్ ద్వారా ప్రభుత్వాన్ని ఆయన దుస్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా అడుగుతూ ఉంటారు. ఆయన వార్డ్‌రోబ్‌కు అయ్యే ఖర్చు ఎవరో పెడుతున్నారంటూ విపక్షాలు కూడా విమర్శలు సంధిస్తుంటాయి. ఈ విషయంపై ప్రధాన మంత్రి కార్యాలయం పూర్తి స్పష్టతను ఇచ్చింది. ఆయన ధరించే బట్టలకు సంబంధించి పూర్తి వ్యయం ఆయనదేనని తెలిపింది. కుర్తా పైజమా నుంచి ఫార్మల్ సూట్స్ లేదా క్యాసువల్ వేర్ ప్రతి దానిపై అందరూ ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరైతే ఆయన ఆహార్యాన్ని కాపీ కూడా కొడుతుంటారు.
ప్రధాని మోదీ ధరించే దుస్తులు అవుట్ ఫిట్ కాస్ట్‌ల వివరాలు:
మోదీ ధరించే బట్టలు అన్ని కూడా అహ్మదాబాద్‌కు చెందిన Z బ్లూ అనే టెక్స్‌టైల్స్ నుంచే వస్తాయి. ఆయన మైబాచ్ బ్రాండ్ సన్‌గ్లాసెస్ వాడతారు. వాటి ధర సుమారు లక్షన్నర రూపాయలు. ఆయన ఉపయోగించే మోంట్‌బ్లాంక్ పెన్ ఖరీదు అక్షరాలా లక్షా 30 వేల రూపాయలు. ఆయన ధరించిన ఓ కుర్తాను స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం వేలం వేయగా అది 4 కోట్ల 31 లక్షల రూపాయలు పలికింది. ప్రతి విదేశీ పర్యటనలోనూ వస్త్ర ధారణలో వైవిధ్యం ప్రదర్శించే మోదీ.. ప్రీమియం బ్రాండ్స్‌నే వాడతారని పీఎమ్‌ఓ తెలిపింది.
ఆయన ధరించే దుస్తులపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టగా.. మోదీ తనదైన శైలిలో వారికి సమాధానం చెప్పారు. 2024 సార్వత్రిక సమరంలో ఆయన దుస్తులు కూడా రాజకీయంలో భాగం కాగా.. 250కోట్ల రూపాయలు లూటీ చేసే నాయకులు కావాలా.. రాజకీయ జీవితం మొత్తంలో 250 జతల బట్టలు మాత్రమే ఉన్న తాను కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలంటూ మోదీ వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ లోక్‌సభలో విపక్షనేత రాహుల్ మాత్రం.. లక్షా 60 వేల రూపాయల జీతం మాత్రమే వచ్చే ప్రధాని.. ఇన్ని లక్షల రూపాయల విలువైన దుస్తులు, అవుట్‌ఫిట్‌లు ఎలా ధరిస్తున్నారో ప్రజలందరికీ తెలుసంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.