KCR Governer :   తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు  మధ్య సత్సంబంధాలు లేవనేది బహిరంగరహస్యం. చాలా కాలం నుంచి  ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోర్టు జోక్యంతో  సమస్య పరిష్కారం అయిందేమో అనుకున్నారు కానీ పరిస్థితి్ మళ్లీ మొదటికి వచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు కొన్ని తిప్పి పంపడం.. మళ్లీ బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడం, న్యాయసమీక్షకు పంపడంతో ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో మహేందర్ రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం.. తర్వాతి రోజే సచివాలయం మొత్తం స్వయంగా చూపించడంతో రాజకీయవర్గాలు ఒక్క సారిగా ఆశ్చర్యపోతున్నాయి. కేసీఆర్ చర్యలు ఊహాతీతం అనుకుంటున్నారు. 


గవర్నర్ తో సీఎంకు ఉన్న అభిప్రాయబేధాలు తొలగిపోయినట్లేనా ?


సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు.  కానీ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని.. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి  రాలేదని  విమర్శించారు. ఈ విమర్శల్ని సీరియస్ గా తీసుకున్న  రాజ్ భవన్ ... ప్రభుత్వం అసలు రాజ్ భవన్‌కు ఆహ్వానం పంపలేదని అధికారికంగా ప్రకటించింది. గవర్నర్ కూడా రెండు, మూడు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ఆహ్వానం పంపి ఉంటే.. ఆ విషయాన్ని ప్రభుత్వం  చెప్పి ఉండేది. కానీ సైలెంట్ గా ఉండటంతో.. గవర్నర్ ను పిలవలేదని స్పష్టయింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సచివాలయంలో ఆలయం ప్రారంభోత్సవానికి  గవర్నర్ ను ఆహ్వానించడమే కాదు గేటు దగ్గరకు వెళ్లి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలికారు. తర్వాత సెక్రటేరియట్ ను స్వయంగా చూపించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సీఎస్ శాంతికుమారితో అతిథి మర్యాదలు కూడా చేశారు. ఈ ఫోటోలన్నీ వైరల్ అయ్యారు. కేసీఆర్, గవర్నర్ మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోయినట్లేనని అనుకున్నారు. 


అసలు ఎందుకు విభేధాలు.. ఎందుకు తొలగిపోయాయి ?


బీజేపీతో బాగున్నప్పుడు గవర్నర్ తోనూ కేసీఆర్‌కు పెద్దగా పేచీ లేదు. కానీ బీజేపీపై యుద్ధం ప్రకటించిన తర్వాత... రాజ్ భవన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించింది ప్రభుత్వం. గవర్నర్ ప్రజాదర్భార్‌లు నిర్వహించాలనుకోవడంతో పాటు.. ఢిల్లీకి  పంపే నివేదికల్లో రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయానికి  బీఆర్ఎస్ సర్కార్ వచ్చింది. దీంతో అసలు గవర్నర్ వ్యవస్థను గుర్తించడం  మానేశారు. ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్  భవన్లో ఎట్  హోమ్ కూడా హాజరు కాలేదు. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని మంత్రులు తరచూ విమర్శలు చేస్తున్నారు. కానీ  తన చర్యలను .. తమిళిశై ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూనే ఉన్నారు. 


ఎమ్మెల్సీల ఫైల్, పెండింగ్ బిల్లులు ఆమోదం కోసం  వ్యూహమా ?


కేసీఆర్ రాజకీయాలు ఊహించనివిగా ఉంటాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు  ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం రాజ్  భవన్ లో ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం పైల్ న్యాయసమీక్షలో ఉంది. ఇవి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఎన్నికల షెడ్యూల్ వస్తే..  ఎమ్మెల్సీల ఫైల్ పక్కన పెడితే మళ్లీ తర్వాత  వచ్చే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చే బిల్లు కూడా  ప్రభుత్వానికి ముఖ్యమే. గవర్నర్ తో లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే సమస్యలు వస్తాయని కేసఆర్.. రాజీకి వచ్చినట్లుగా  రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 


అయితే ఇప్పుడు గవర్నర్ తో  మామూలుగా ఉండటం వల్ల.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందన్న  ప్రచారం చేసే వారికి ఈ పరిణామం మరింత  బలం చేకూరుస్తుంది. ఇది బీజేపీకి మరింత ఇబ్బందికరం కానుంది.