Balineni Hot Comments : వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీకి చెందిన పెద్ద నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో ఇటీవల వరుస వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన... తనపై కుట్ర జరుగుతోందన్నారు. సొంత పార్టీకి చెందిన పెద్ద నేతలే కుట్రలు చేస్తున్నారని వారికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారని ్నుమానం వ్యక్తంచేశారు. ఎవరు చేస్తున్నారో కూడా తనకు తెలుసన్నారు. టీడీపీతో వాళ్లు టచ్‌లో ఉన్నారని.. హవాలా మంత్రి అని వాళ్లే అనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని బాలినేని ఆరోపణలు
ఒంగోలులో ప్రతిపక్ష నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బాలినేని ఆరోపమలుచేస్తున్నారు. జనసేన నాయకురాలికి మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనకు సంబంధం లేని విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని వాపోయారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. జనసేన నాయకురాలు అరుణకు బాలినేని అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సాంబశివరావు ఇటీవల అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది.
పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలన్న బాలినేని
బాలినేనిపై ఆరోపణలు రావడంతో ఆయన అనుచరులు కేసులు పెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తర్వాత కేసులు వెనక్కి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరడం వల్లే కేసులు వెనక్కి తీసుకున్నామని చెప్పిన బాలినేని.. పవన్ కూడా నిజాలు తెలుసుకోవాలన్నారు. ఈ కుట్రలన్నింటిలోనూ తమ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని..తనపై జరుగుతున్న కుట్రల విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాలినేని చెబుతున్నారు.
మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని చుట్టూ వివాదాలు
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల క్రితం అల్లూరు వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని.. కవిత అనే మహిళ రైతు సమస్యలపై ప్రశ్నించింది. దీంతో బాలినేని అనుచరులు ఆమె ఇంటి గేటుకు తాళం వేశారని టీడీపీ ఆరోపించింది. ఈ అంశంపైనా దుమారం రేగుతోంది. ఇటీవల చెన్నైలో పెద్ద ఎత్తున ఒంగోలు నుంచి తరలిస్తున్న హవాలా మనీని పట్టుకున్నారు. ఆ విషయంపైనా టీడీపీ నేతలు బాలినేనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని వివాదాల్లో కూరుకుపోతూండటంతో తన వెనుక కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.