YSRCP Colours For NTR Statue :   కృష్ణాజిల్లా గుడివాడ కేంద్రం గా రాజ‌కీయం వేడెక్కుతోంది. గుడివాడ‌ను కేంద్రంగా చేసుకొని టీడీపీ జిల్లా మ‌హానాడు కు రెడీ అవుతుండ‌గా...వైఎస్ఆర్‌సీపీ కూడా  పొలిటిక‌ల్ గా టీడీపీకి కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్ప‌టికే జిల్లాలో రెండు పార్టిల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఎకంగా ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ  పార్టీ రంగులు వేసిన ఘటన చోటు చేసుకుంది.  గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ  రంగులు వేశారు.


బొమ్ములూరులో  ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు


టీడీపీ  మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో  బొమ్ములూరు గ్రామం ఉంది. విషయం తెలుసుకొన్న త‌రువాత  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇత‌ర టీడీపీ నేతలు సంఘ‌ట‌నా స్ద‌లానికి వ‌చ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న  రంగులు చెరిపి వేస్తూ పసుపు రంగులు వేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .


కొడాలి నాని తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం


గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిప‌డ్డారు. మహానాడు బ్యానర్ల పై , అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నార‌ని  మాజీ మంత్రి పిన్నమనేని విమర్శలు గుప్పించారు.  తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమ‌ని పిన్నమనేని చెప్పారు. పార్టీ నాయకులు వెళ్లిన తర్వాత, బొమ్మలూరు టిడిపి కార్యకర్తలపై దాడికి పాల్ప‌డ్డారని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే టీడీపీ,వైసీపీ నేత‌ల మ‌ధ్య ప్ర‌ధానంగా  గుడివాడ‌లో రాజ‌కీయం రంజుగా సాగుతుంది. గుడివాడ‌లో మాజీ మంత్రి కొడాలిని టార్గెట్ చేసిన టీడీపీ, అక్క‌డే జిల్లా మ‌హానాడు నిర్వ‌హించేందుకు భారీగా స‌న్నాహాలు చేస్తోంది. 


మహానాడుకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రయత్నాలు


ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మ‌కూరు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఇక్క‌డ టీడీపీ తిరిగి ప‌ట్టు సాదించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.మాజీ మంత్రి కొడాలిని ఢీ కొట్టేందుకు టీడీపీ అన్ని శ‌క్తుల‌ను కూడ క‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని  టీడీపీ త‌న‌కు అనుకూలంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ విగ్ర‌హానికి వైసీపీ రంగులు వేయ‌టం పై కూడ టీడీపీ ఆందోళ‌న‌ను ఉదృతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. టీడీపీ మ‌హానాడు పై వైసీపీ నాయ‌క‌త్వం కూడ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందున విగ్రహాలకు రంగులు వేస్తే తప్పేమిటని కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.