Maharashtra Political Crisis : మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హతా నోటీసులకు ఇచ్చిన గడువును జూలై 12 వరకూ పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ తమకు ఇచ్చిన అనర్హత నోటీసులపై తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసనసభాపక్ష నేతగా తనను తొలగించడంపైనా షిండే అత్యున్నత న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనర్హత నోటీసులపై ముంబై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని ఎమ్మెల్యేల తరపు లాయర్ వాదించారు. నోటీసులు జారీచేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
వచ్చే నెల 12 వరకూ అనర్హతా నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు గడువు !
జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
రెబల్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్న సుప్రీంకోర్టు !
అనర్హతా పిటిషన్లపై వివరణ ఇవ్వకపోతే సోమవారం సాయంత్రం తర్వాత వారిపై డిప్యూటీ స్పీకర్ అనర్హతా వేటు వేసి ఉండేవారు. అయితే సుప్రీంకోర్టు గడువు పెంచడంతో వారికి రిలీఫ్ లభించినట్లయింది. అదే సమయంలో మహారాష్ట్రలో పరిస్థితులు బాగో లేవని చెప్పినందున రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత.. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
రెబల్ ఎమ్మెల్యేల తదుపరి వ్యూహం ఏమిటి ?
ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నారు. సంక్షోభం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరిస్తే అనర్హతా వేటు పడుతుంది. ఇప్పటికే శివసేన విప్ జారీ చేసింది. దాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు. వారు వెనక్కి రాకపోతే... ఆలస్యం అవ్వొచ్చేమో కానీ అనర్హతా వేటు ఖాయమని శివసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.