వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress Party ) చెందిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ( Avanti Srinivas ) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై పవన్ ప్రభ అనే వ్యక్తి విశాఖ పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కంప్లైంట్ సెల్‌లో ( Vizag Central Complaint Cell ) ఫిర్యాదు చేశారు. కోరాడ లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో అవంతి శ్రీనివాస్ ఒక జర్నలిస్టు ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం నిధులను బ్యాంక్ అకౌంట్లలో సీఎం జగన్ మీట నొక్కి జమ చేశారు. అదే రోజున పలు చోట్ల సభలు ఏర్పాటు చేసి.. రైతులకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మంచిని మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ కోరాడలో ( Korada ) సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించినట్లుగా వీడియోలు వైరల్ ( Viral Videos ) అయ్యాయి. ఓ పోలీస్ అధికారిని కూడా ఆయన అదే విధంగా కించపర్చినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు గుప్పించింది.
అయితే పోలీసు అధికారిపై ( Police Officer ) ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. కానీ మీడియా ప్రతినిధి కులం తెలిసేలా వ్యాఖ్యలు చేయడం.. ఒరేయ్ అనడంతో .. ఆ సామాజికవర్గం ( Caste ) నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు... అదే కారణంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు కానీ కేసు నమోదు చేశారో లేదో స్పష్టత లేదు. పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు, వివిధ సామాజికవర్గ సంఘాలు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయన చిక్కుల్లో పడినట్లయింది.