Kiran AP PCC No :  ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డిని నియమించే విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. స్వయంగా కిరణ్‌ను పిలిపించి పార్టీ హైకమాండ్ పెద్దలు చర్చలు జరిపారు. బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని మొయ్యప్పన్ లాంటి నేతలు మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సోనియాతో కిరణ్ దాదాపుగా గంట సేపు భేటీ అయ్యారు. అయినప్పటికీ పీసీసీ చీఫ్ విషయంలో క్లారిటీకి రాలేకపోయారు. కిరణ్ అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఆయన సలహాలు వాడుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు షాక్, మరో రూ.వెయ్యి కోత!


ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర విభజనను అంగీకరించక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఆయన క్రియాశీలకంగా లేరు. పార్టీలో ఏ పదవులూ చేపట్టలేదు. ఏపీలో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గతంలో పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో ఆ స్థానాన్ని సాకే శైలజానాథ్‌కు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కిరణ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడానికి ప్రయత్నాలను హైకమాండ్ చేసింది. కానీ కిరణ్ అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 


నిజానికి చాలా రాష్ట్రాల్లో పీసీసీ పోస్టు కావాలనే ఒత్తిడి ఉంటుంది. ఎంపిక చేయడానికి హైకమాండ్ తంటాలు పడుతుంది. కానీ ఏపీలో మాత్రం తీసుకోవడానికి కూడా ఆసక్తిగా లేరు. ఇస్తామన్నవారు తమకు వద్దంటున్నారు. తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే... తన నియామకం టీడీపీ సిఫార్సుతో జరిగిందన్న ప్రచారం చేస్తారని దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని కిరణ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన సోదరుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.


వాళ్లంతా గ్రూపు రాజకీయాలతో బిజీ , మాకో నాయకుడు కావాలి -చంద్రబాబుకు అనంత టీడీపీ కార్యకర్తల డిమాండ్ !


కిరణ్ చెప్పిన మాటలతో ఏకీభవించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన సేవలను బ్యాక్ ఎండ్‌లో ఉపయోగించుకుని ఏపీ పీసీసీకి ఇతర నేతను కొత్త చీఫ్‌గా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినందున తెలంగాణ రాజకీయాలపైనా ఆయనకు అవగాహన ఉంటుందని.. అలాగే జాతీయ రాజకీయాలపైనా కొన్ని అంశాల్లో ఆయనను క్రియాశీలకంగా ఉంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే.. కిరణ్‌ను ఏపీ పీసీసీ చీఫ్‌ నియమించడం ఆగిపోయినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.