Chandrababu :  అధికారంలో ఉంటే రాజకీయ ప్రత్యర్థులను ఇంత దారుణంగా వేధించవచ్చని.. అణిచివేయవచ్చునని తనకు జగన్మోహన్ రెడ్డి పాలన చూసే తెలిసిందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ను నుంచి ఇలాంటి విషయాలు తానుచాలా నేర్చుకున్నాన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అర్థరాత్రి పూట లైట్లు పగల గొట్టి, తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లారు. చిత్రహింసలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. వారిలో ఒకరు ఇంకా పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు  ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. 


తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు కౌంట్ డౌన్ 


తప్పుడు కేసులతో బెదిరించి ఇష్టానుసారంగా వ్యవహరించే ఏపీ పోలీసు అధికారుల ఆటలు సాగనీయబోమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వారిపై చట్టపరంగా కేసులు పెట్టి దోషులను చేస్తామని హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సిన్సియర్‌గా పనిచేసే అధికారులను అభినందిస్తామని అన్నారు.రాజకీయ పార్టీగా తమకు పోలీసులతో శత్రుత్వం లేదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించే అధికార పార్టీపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు. 


పోలీసులు సైకోలు మాదిరిగా తయారయ్యారా ?


పోలీసులు సైకోలుగా తయారయ్యారని  సాంబశివరావు, వెంకటేష్‌లను అరెస్ట్ చేసిన వైనాన్ని వివరిస్తూ చంద్రబాబు మండిపడ్డారు.  పోలీసులు అధికార పార్టీ చెప్పినట్లుగా చేసి.. చట్టాన్ని ఉల్లంఘించి బలి పశువులు కావొద్దని చంద్రబాబు హెచ్చరించారు.  చట్టాలను ఉల్లంఘించి ఏకపక్షంగా వచ్చి కావాలని తప్పుడు కేసులు పెట్టి హింసకు గురిచేస్తే సహించబోమని అన్నారు. రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 41 ఏ నోటీసులు ఇవ్వకుండా 600 మందిని అరెస్ట్ చేశారని..  కేసులు పెట్టారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదని చంద్రబాబు అన్నారు. 


ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే ఉండదన్న చంద్రబాబు


టీడీపీ కార్యకర్తలపై కొద్ది రోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు పలు వీడియోలు ప్రదర్శించారు. బిడ్డకు  పాలిస్తున్న తల్లీని వదిలి పెట్టకుండా సీఐడీ పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి యూనిఫాం వేసుకునే అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. పోలీసులు తీసుకెళ్లిన సాంబశివరావు పోలీసులు తమను ఎలా టార్చర్ పెట్టారో మీడియాకు వివరించారు.  నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి దౌర్జన్యంగా తీసుకెళ్లారని మీడియాకు తెలిపారు.