పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ అధినేత చంద్రబాబు యువతకే 40 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లుగాప్రకటించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.  అభివృద్ధి కావాలంటే టీడీపీ అధికారంలో ఉండాలన్నారు. యువత పోరాడితేనే ఏదైనా సాధ్యమన్నారు. వ్యవస్థలో మార్పు తేవాలనుకునే యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సాధించిన విజయాలను చరిత్ర ఎప్పుడూ మర్చిపోలేన్నారు.  పార్టీని అధికారం కోసం స్థాపించలేదని గుర్తు చేశారు. 


తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉందని ఎగతాళి చేస్తున్నారని..నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆనాడు ఎన్టీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీటింగ్ పెట్టారన్నారు. అక్కడకి భారీగా జనం వచ్చారు. ఆ ఆవేశంతో పార్టీ ప్రకటించారు. తెలుగు జాతి ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగువారి సంక్షేమమే తెలుగుదేశం ప్రధాన లక్ష్యమని చంద్రబాబు గుర్తు చేశారు. ఇవాళ మళ్లీ పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు.  తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. 


తెలుగువారు ఉన్నంత వరకు తెలుగువారి మనసుల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి. తెలుగువారి గుండె చప్పుడు టీడీపీ. నలభై సంవత్సరాల్లో 21 ఏళ్లు అధికారంలో ఉన్నాం. 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఎక్కడ ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయం. తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత రాజకీయాలు మారిపోయాయి. పార్టీ పెట్టక  ముందు అంతా వేలిముద్రలు వేసేవాళ్లు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత యువత రాజకీయాల్లోకి వచ్చారు. అదే మొదటి మార్పు. ఒకప్పుడు కొన్ని కుటుంబాలకు పరిమితిమైన రాజకీయాన్ని పేదల వద్దకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. 







టీడీపీని,తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉదయం నుంచి తీరిక లేకుండా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ ఆవిర్భవించిన ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేడుకల్లోనూ పాల్గొన్నారు.