పంజాబ్‌లో గెలుపు తర్వాత దేశ వ్యాప్తంగా బలపడాలని భావిస్తున్న 'ఆప్'.. మేధావులతో, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతోంది. దక్షిణాదిలో ప్రవేశించాలంటే తెలంగాణ సరైన వేదిక అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.  ఇందు కోసమే తన ఫోకస్ తెలంగాణపై పెట్టారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో పర్యటించనున్న కేజ్రీవాల్ కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పార్టీనికి బలోపేతం చేసేందుకు, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు  సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటగా ఉమ్మడి వరంగల్ పై దృష్టి సారించి కార్యచరణ మొదలు పెట్టారు. ఆప్ ఎంట్రీతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యయం మొదలు కాబోతోందా.  


జనసమితితో మాట్లాడారా?
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో మొదటగా వరంగల్ లో కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించింది. పార్టీని బలోపేతం చేసేందుకు అధికార పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకుపోవాలని వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ జనసమితి ఆప్‌లో విలీనం కానున్నదనే వార్తలు వస్తుండటంతో ఇతర పార్టీలో నేతలు కూడా ఆప్‌లో చేరేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వాల్యూ కలిగిన నేతలను, మేధావి వర్గాలను, విద్యార్థి సంఘం నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ ప్రజల్లోకి వెళుతుందని ఆప్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం వరంగల్ జిల్లాలో ఆప్ సౌత్ ఇండియా ఇన్‌చార్జి సోమ్‌నాథ్ బార్తి పర్యటించారు. హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. అక్కడి  స్థానిక నేతలను పార్టీలో చేర్చుకొని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.


టీఆర్‌ఎస్‌ టార్గెట్‌


ఆప్ నేత సోమ్ నాథ్ బార్తీ పర్యటనలో టీఆర్ ఎస్ పార్టీపై సీఎం కేసిఆర్ పై విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో అవినీతి, మాఫియా రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు. దిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాల్ ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు. సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో ఇంకా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 60 ఏళ్లు కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దీని కోసమేనా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఫలాలు కేవలం కేసీఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.


పరిస్థితిలో మార్పు రావాలంటే మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు సోమ్‌నాథ్‌. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చేపట్టనున్న న్యాయ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాన్యుడికే అధికారం అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలకు సోమ్‌నాథ్ బార్తి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితి మారాలంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ రావాలన్నారు. 'ట్రిపుల్ హెచ్'' రిటైర్‌మెంట్ తెలంగాణ పేరు చెప్పి దుష్ట రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలోని మేధావులు, విద్యావంతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ముందుకు  రావాలని పిలుపునిచ్చారు.

మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులను టార్గెట్ చేసిన ఆప్:
వరంగల్ లో రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించిన ఆప్ యువతను, మేధావులను, విద్యార్థి సంఘం నాయకులను, ఫేస్ వాల్యూ కలిగిన కమ్యూనిస్ట్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీని ఆప్ లో విలీనం కానుందని కోదండరాం రాష్ట్ర నాయకుడిగా ఆప్ పార్టీని ముందుకు నడిపించున్నరని వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలతో వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉన్నవారు ఆప్ లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫేస్ వ్యాల్యూ కలిగి స్థానికంగా సమస్యలపై దీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 14న హైదరాబాద్ లో కేజ్రీవాల్ పర్యటన ఉండటంతో ఈలోపు పార్టీలో చేరే వారిని సిద్ధం చేసేందుకు కార్యచరణ మొదలు పెట్టారు. తెలంగాణలో మొదటిసారిగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంపై ఆప్ నేతలు దృష్టి సారించడంతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. సాన్యుడికి అధికారం అనే నినాదంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆప్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశించడంతో కొత్త తరం నేతలు పుట్టుకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.