పంజాబ్‌లో గెలుపు తర్వాత దేశ వ్యాప్తంగా బలపడాలని భావిస్తున్న 'ఆప్'.. తెలంగాణపైనా దృష్టి సారించింది. తెలంగాణ మేధావులతో, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నది. దక్షిణాదిలో ప్రవేశించాలంటే తెలంగాణ సరైన వేదిక అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇందుకోసమే తన ఫోకస్ ను తెలంగాణ పై పెట్టారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో పర్యటించనున్న కేజ్రీవాల్ కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ లో పార్టీనికి బలోపేతం చేసేందుకు, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటగా ఉమ్మడి వరంగల్ పై దృష్టి సారించి కార్యచరణ మొదలు పెట్టారు. ఆప్ ఎంట్రీతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యయాలు మొదలు కాబోతున్నాయి.
వరంగల్‌లో ఆమ్ ఆద్మీ కార్యకలాపాల జోరు !
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో మొదటగా వరంగల్ లో కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించింది. పార్టీని బలోపేతం చేసేందుకు అధికార పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకుపోవాలని వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ జనసమితి ఆప్‌లో విలీనం కానున్నదనే వార్తలు వస్తుండటంతో ఇతర పార్టీలో నేతలు కూడా ఆప్ చేరేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వ్యాల్యూ కలిగిన నేతలను, మేధావి వర్గాలను, విద్యార్థి సంఘం నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ ప్రజల్లోకి వెళుతుందని ఆప్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం వరంగల్ జిల్లాలో ఆప్ సౌత్ ఇండియా ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి పర్యటనలు చేపట్టారు. హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. అక్కడి స్థానిక నేతలను పార్టీలో చేర్చుకొని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా ఆప్ నేత సోమ్ నాథ్ టీఆర్ ఎస్ పార్టీపై సీఎం కేసిఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అవినీతి, మాఫియా రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు. ఢిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాల్ ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు.
సామాన్యుడికే అధికారం అనేది ఆమ్ ఆద్మీ నినాదం !
సామాన్యుడికే అధికారం అనే నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. యువతను, మేధావులను, విద్యార్థి సంఘం నాయకులను, ఫేస్ వాల్యూ కలిగిన కమ్యూనిస్ట్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉన్నవారు ఆప్ లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫేస్ వ్యాల్యూ కలిగి స్థానికంగా సమస్యలపై ధీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏప్రెల్ 14న హైదరాబాద్ లో కేజ్రీవాల్ పర్యటన ఉండటంతో ఈ లోపు పార్టీలో చేరే వారిని సిద్ధం చేసేందుకు కార్యచరణ మొదలు పెట్టారు. తెలంగాణలో మొదటి సారిగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంపై ఆప్ నేతలు దృష్టి సారించడంతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. సాన్యుడికి అధికారం అనే నినాధంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆప్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశించడంతో కొత్త తరం నేతలు పుట్టుకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ జనసమితి విలీనంపై ప్రచారం !
తెలంగాణ జనసమితి పార్టీని ఆప్ లో విలీనం కానుందని కోదండరాం రాష్ట్ర నాయకుడిగా ఆప్ పార్టీని ముందుకు నడిపించున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలతో
తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వ్యాల్యూ కలిగిన కోదండరాంను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నది. జనసమితి కేడర్ కూడా 'ఆప్'లో విలీనానికే సుముఖత చూపుతున్నారని అంటున్నారు. రెండు పార్టీల మధ్య విలీనం కోసం, కలిసి పనిచేయడం కోసం చర్చలూ జరుగుతున్నాయి. వచ్చే నెల 14న కేజ్రీవాల్ హైదరాబాద్ టూర్ సందర్భంగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. విలీన ప్రక్రియను ఇటు కోదండరాం, అటు ఆప్ వర్గాలు ధ్రువీకరించడంలేదు. రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నది నిజమేనని, రెండు వైపుల నుంచీ విలీనం ఆలోచనలున్నాయని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైతే విలీనం అనే మాట లేదని కోదండరాం చెబుతున్నారు.