ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ( Kodali Nani ) అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ( Varla Ramaih ) లేఖ రాశారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నాడని లేఖలో వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజలపై కొడాలి నాని, అతని అనుచరులు వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. గుడివాడలో కొడాలి నాని పీనల్ కోడ్, రాజ్యాంగం అమలులో ఉందని అందరూ అనుకుంటున్నారని కొన్ని ఘటనలను లేఖలో డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
జనవరి 2022లో గుడివాడలో అక్రమంగా క్యాసినో ( Casino ) నిర్వహిస్తున్నట్లుగా బయటపడిందని తాము అనేక ఆధారాలతో డీజీపీ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశామని లేఖలో వర్ల రామయ్య తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డీఎస్పీ కమిటీ ( DSP ) వేసి విచారణ జరుపుతున్నారని తెలిపారని.. కానీ ఆ కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో... ఎవరికీ తెలియదన్నారు. ఆ కమిటీ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. అలాగే 2015లో గుడివాడ ( Gudivada ) నియోజవర్గానికి చెందిన లంకా విజయ్ మరణం అనే వైఎస్ఆర్‌సీపీ నేత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని కానీ దానిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రమాదంగా మార్చబడిన హత్య కావొచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇటీవల అడపా బాబ్జీ ( Adapa Babji ) అనే వైఎస్ఆర్‌సీపీ నేత కూడా మృతి చెందారని.. ఆయన మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని అందరూ అనుకుంటున్నారని లేఖలో వర్ల రామయ్య గుర్తు చేశారు.
ఈ ఆరోపణలు తీవ్రంగా వస్తున్న సమయంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో వర్ల రామయ్య కోరారు. అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతోపాటు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నివేదికను కూడా బహిర్గతం చేయాలని వర్ల రామయ్య కోరారు.
కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలపై ( TDP ) తిట్లతో విరుచుకుపడుతూంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలూ ఆయనను టార్గెట్ చేసుకుంటున్నారు. గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారం లో ప్రభుత్వం, పోలీసులు పెద్దగా స్పందించకపోవడాన్ని టీడీపీ చాన్స్‌గా తీసుకుంది. డీఎస్పీ కమిటీని వేసినట్లుగా పోలీసులు ప్రకటించినా ఎలాంటి నివేదికా బయట పెట్టలేదు. దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గుడివాడలో సొంత రాజ్యాంగాన్ని కొడాలి నాని అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.