Khammam Farmers: ప్రభుత్వ భూముల్లో లే అవుట్‌లు వేసి వాటిని విక్రయించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. అసైన్డ్, ఇనామ్ భూములను సాగు చేస్తున్న రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి వాటిలో వెంచర్లు వేసి విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government Decision Over Lands) నిర్ణయించింది. అయితే ఏళ్ల తరబడి వారసత్వంగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇప్పుడు రైతులు ఆందోళనలకు సిద్దమయ్యారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు..
ప్రభుత్వ లే అవుట్ల నిర్మాణం కోసం ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు (Pilot Project In Khammam)ను రూపొందించారు. ఇందులో భాగంగా ఖమ్మం – కొత్తగూడెం, ఖమ్మం – సత్తుపల్లి, ఖమ్మం – ఇల్లందు ప్రధాన రహదారిలో ఇరువైపులా ఉన్న అసైన్డ్ ల్యాండ్ (Assigned Lands in Khammam District)లను గుర్తించారు. పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపంలోని భూములను గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సమీపంలో 320 ఎకరాలు, రఘునాధపాలెం మండలంలో 212 ఎకరాలు, కొణిజర్ల మండలంలోని తనికెళ్ల వద్ద 86 ఎకరాలు, వైరా మున్సిపాలిటీలోని సోమవరంలో 150 ఎకరాలు, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లిలో 96 ఎకరాలు మొత్తం 864 ఎకరాలు లే అవుట్‌ల నిర్మాణానికి అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో సాగులో ఉన్న భూములెన్ని, సాగులో లేని భూములెన్ని ఉన్నాయనే విషయంపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.
మా భూములను ఇచ్చేది లేదంటున్న రైతులు..
వారసత్వంగా తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను లే అవుట్ల నిర్మాణం కోసం ల్యాండ్‌పూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తే తాము ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు (TRS Party Leaders) సైతం ఈ విషయంలో రైతులకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా అదే భూములపై ఆధారపడిన తాము ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందని, పచ్చని పంటలు పండే భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో గుంజుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఖమ్మం రూరల్‌లో ఉన్న భూములను తీసుకోవద్దని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం గమనార్హం. దీంతోపాటు వైరా మున్సిపాలిటీలోని సోమవరంలో సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న లే అవుట్ నిర్మాణాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: TS Farmer: పంటను కాపాడుకునేందుకు రైతు సరికొత్త ఐడియా - అన్నదాత దెబ్బకు కోతులు పరార్
Also Read: Yadadri: యాదాద్రి నిజరూప దర్శనం నేడే, తొలి భక్తుడిగా కేసీఆర్ - ఆలయంలో నేటి కార్యక్రమాలు ఇవీ