యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి కొద్ది గంటలే మిగిలి ఉంది. సోమవారం (మార్చి 28) ఉదయం 11.55 గంటలకు మంచి ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈ మహా క్రతువుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు.
ఈ క్రతువులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.
యాదాద్రి ఆలయంలో నేటి కార్యక్రమాలు ఇవీ..
* ఉదయం 7.30 గంటల నుంచి నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి కార్యక్రమాలు ఉంటాయి.
* ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం ఉంటుంది.
* ఉదయం 10 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది.
* మధ్యాహ్నం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు
* సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం ఉంటుంది.
ఆదివారం పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం నాడు మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి.