Guntur KTR Fan: సినిమా స్టార్లకు, పేరు పొందిన రాజకీయ నాయకులకు ఉండే ఫ్యాన్ ఫోలోయింగే వేరు. కొందరు మరీ తమ నాయకుడు లేదా నటుడి పట్ల ఏ స్థాయిలో అభిమానం చూపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా వేలాది కిలో మీటర్లు సైకిళ్లు తొక్కుకుంటూ తమ నాయకుడ్ని కలుసుకునేందుకు వెళ్లిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. తాజాగా ఇప్పుడు కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ కోసం ఓ వ్యక్తి మోటార్ సైకిల్ యాత్రకు సిద్ధమయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం విశేషం. కేటీఆర్ సీఎం అవ్వాలని ఆయన ఈ బైక్ యాత్ర చేస్తున్నాడట. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీకి చెందిన తమ స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ కూడా తీసుకున్నాడు.


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీలోని ఓ వీరాభిమాని కేటీఆర్ సీఎం కావాలంటూ బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజు గౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్ యాత్ర గురించి తాను త‌మ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాన‌ని బాలరాజు గౌడ్ మీడియాకు తెలిపాడు. 


తన యాత్రకు ఎమ్మెల్యే పిన్నెల్లి ప‌ర్మిష‌న్ కూడా ఇచ్చార‌ని చెప్పాడు. కేటీఆర్ సీఎం కావాలని యాదాద్రిలో ప్రత్యేక పూజ‌లు చేయిస్తానని సదరు వ్యక్తి తెలిపాడు. తనకు కేటీఆర్ విధానాలు నచ్చుతాయని, అందుకే తన అభిమాన నేత సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వివరించాడు. ఆయన సీఎం కావాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పేముంద‌ని కూడా బాల‌రాజు గౌడ్ చెప్పాడు.


అమెరికా పర్యటనలో బిజీగా KTR
తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో ప్రస్తుతం మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే మంత్రి తన విద్యార్థి జీవితాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. శుక్రవారం న్యూయార్క్ నగరంలో స్ట్రీట్ ఫుడ్ కొనుక్కోనేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో నిలబడ్డారు. కేటీఆర్ విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో చికెన్ రైస్ ని కొనుక్కొని తిన్నారు. అక్కడ తన విద్యార్థి జీవితం జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తులా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ కి క్యాబ్లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు.