చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టీడీపీ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కొంత మందిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. లోకేష్‌ యుగళం పాదయాత్రను కూడా అడ్డుకున్నారు పోలీసులు. జిల్లాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యగా నారా లోకేష్‌ను కూడా అడ్డుకున్నారు పోలీసులు. యువగళం పాదయాత్రలో ఉండగా.. బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ యువగళం క్యాంపు నుంచి లోకేష్‌ను బయటకు రానివ్వలేదు. దీంతో కింద కూర్చొని నిరసన తెలిపారు లోకేష్‌. 


చంద్రబాబును అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా జాతీయ రహదారిని నిర్బంధించారు రాజోలు నియోజకవర్గ టీడీపి నాయకులు. 
చంద్రబాబును కారణం చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుని అరెస్ట్ చేయటానికి నిరసనగా నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు మామిడికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. 


ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యప్తంగా టీడీపీ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. మరికొన్ని ప్రాంతాల్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. అనంతపురంలో అరవింద్‌నగర్‌లోని పరిటాల శ్రీరామ్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆయన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అలాగే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధం చేస్తున్నారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ఎస్ గేట్ దగ్గర మాజీ మంత్రి పరిటాల సునీత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సునీతను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. టీడీపీ నాయకులు పట్టుకున్నారు. దీంతో పరిటాల సునీత అరెస్ట్‌ చేశారు. ఆమెను తరలిస్తున్న వాహనానికి అడ్డుగా నిలబడ్డ టీడీపీ శ్రేణులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీతను అరెస్ట్ చేసి ధర్మవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం పూలకుంట దగ్గర ప్రధాన రహదారిపై టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ఆపాలన్నారు. సైకో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. 


చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం పాత ఊరులో వాటర్ ట్యాంక్ ఎక్కాడు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్. చంద్రబాబును వెంటనే విడుదల చేయకపోతే ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. పోలీసులు అక్కడి చేరుకుని ముక్తియార్‌ను కిందకు దించారు. చంద్రబాబు అరెస్టుతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేసినట్టు సమాచారం. 


ప్రకాశం  జిల్లా మార్కాపురం నియోజకవర్గం తాడివారిపల్లిలో చంద్రబాబుని కాన్వాయ్‌ను అడ్డుపడ్డారు గ్రామస్థులు. వారిని పక్కకు తప్పించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. 


ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కంచికచర్లలో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపుటాల జరిగింది. పలువురు టీడీపీ నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. 


చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ వైసీపీ కుట్రే అన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వివిధ సెక్షన్ల కింద నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ముఖ్యమంత్రిగా నేరుగా ఏ విధంగానూ సంబంధం లేని స్కిల్ కార్పొరేషన్‌లో ఏదో అవినీతి జరిగిందనడం కేవలం కక్ష సాధింపులో భాగంగానే అని అన్నారు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చిన్న మచ్చ కూడా లేకుండా నిజాయితీ-నిబద్ధత కలిగిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. శని, ఆదివారాలు కోర్టు సెలవులు కావడంతో.. బెయిల్ రాకూడదనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని అన్నారు పల్లె రఘునాథ్‌రెడ్డి. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజానీకం దీన్ని ఏ మాత్రం హర్షించరని అన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక జీ20 జరుగుతుండగా.. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.