చంద్రబాబుని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను విజయవాడ తరలిస్తున్నారు. గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి లేదా, గుంటూరు, విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. 


సెక్యూరిటీ విషయంలో నోటీసులు..
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సెక్యూరిటీ విషయంలో నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబుకు కేటాయించిన కేంద్ర భద్రత సిబ్బందినీ డీజీపీ కార్యాలయంలో సరెండర్ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 


పూర్తి వివరాలతో ప్రెస్ మీట్..
చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే ప్రెస్ మీట్లకు రెడీ అవుతున్నారు. ప్రెస్ మీట్లు ఉంటాయని ఆయా నేతల కార్యాలయాలనుంచి మీడియాకు వర్తమానాలు అందాయి. ఇక ఈ అరెస్ట్ పై అధికారిక ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశముంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ సీఐడీ డీజీ ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ వివరాలను ఆయన మీడియాకు వివరిస్తారు. 


నేడే కోర్టుకి..
ఈరోజు చంద్రబాబుని విజయవాడకు తరలించి, ఇదేరోజు ఆయన్ను కోర్టుకి హాజరు పరిచే అవకాశముంది. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారని, ఆ తర్వాత మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబుని హాజరుపరుస్తారని అంటున్నారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. 


అరెస్ట్ తో ఉద్రిక్తత..
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్టింగ్ లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీలో సంతోషాన్ని నింపగా, టీడీపీలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అటు పోలీసులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఎవరూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపకుండా అడ్డుకుంటున్నారు. 


నెక్ట్స్ ఏంటి..?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలెవరూ నేరుగా ప్రెస్ మీట్లు పెట్టలేదు, చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని కూడా అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. అటు నారా లోకేష్ యాత్ర నుంచి నేరుగా విజయవాడకు రావాలనుకుంటున్నారు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు, మీడియా సమావేశం పెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన లోకేష్, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 


ఏమేం కేసులు పెట్టారంటే..?
చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లో అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఆ స్కామ్‌ లో నమోదు చేసిన కేసులోనే చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌విత్‌ 34, 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు.