దాదాపు 12 గంటల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. టీడీపీ అధినేత చంద్రబాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు చంద్రబాబుకు సిట్ తరఫున వచ్చిన డీఐజీ రఘురామరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులకు, చంద్రబాబు, ఆయన తరఫు లాయర్లకు మధ్య ఆసక్తికరమైన వాదన జరిగింది.
దాదాపు ఐదున్నర గంటల సమయంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్ తలుపు తట్టారు. పోలీసులు పిలవడంతో చంద్రబాబు బయటకు వచ్చి డీఐజీ రఘురామరెడ్డితో మాట్లాడారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని చెప్పారు.
పోలీసుల ఇచ్చిన FIR కాపీని న్యాయవాదులు, చంద్రబాబు పరిశీలించారు. కొన్ని గంటల్లో పూర్తి వివరాలు ఇస్తామన్నారు పోలసులు. FIRలో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీశారు. అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఆర్గ్యూ చేశారు. పౌరుడిగా తన హక్కని అన్నారు.
అరెస్టు చేసిన తర్వాత తగిన పత్రాలు ఇస్తామన్నారు పోలీసులు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందన్నారు చంద్రబాబు, ఆయనతరఫు న్యాయవాదులు. అరెస్టు నోటీసులు ఇచ్చామని సమాధానం చెప్పారు పోలీసులు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామన్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామన్నారు.
అవగాహన లేకుండా చంద్రబాబు న్యాయవాదులు వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందన్నారు చంద్రబాబు. తాను రోడ్డుపైనే ఉన్నానని... ఎక్కడికి పారిపోవడం లేదన్నారు. అర్ధరాత్రి వచ్చి భయోత్సాతం సృష్టించాల్సిన అవసరమేంటి? నిలదీశారు.