మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వేకువజామున అరెస్టు చేశారు.  నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 


‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి పథకాలను వివరించేందుకు మహిళలతో మాట్లాడారు. సాయంత్రానికి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. 


నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఉన్న ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. శుక్రవారం సాయంత్రం నుంచే ఆయన్ని అరెస్టు చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీన్ని టీడీపీ వర్గాలు, పోలీసులు ఖండించినప్పటికీ సైలెంట్‌గా పని కానిచ్చేశారు పోలీసులు. 


అదే టైంలో పోలీసుల వ్యూహాలకు దీటుగా టీడీపీ శ్రేణులు కూడా ప్లాన్ చేశారు. చంద్రబాబు బస చేసిన ఏరియాకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ఆయనకు రక్షణగా ఉన్న పోలీసులను తప్ప వేరే వారిని రానివ్వలేదు. ఈసందర్భంగా పోలీసులకు టీడీపీ వర్గాలకు తోపులాట వాగ్వాదాలు జరిగాయి. 


అనంతపురం, కర్నూలు, కడప నుంచి వచ్చిన బెటాలియన్లు టీడీపీ శ్రేణులను తోసుకుంటూ చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌కు చేరుకొని నోటీసులు అందజేశారు. ఆయన తరలింపు సమయంలో కూడా అదే టెన్షన్ వాతావరణం నెలకొంది.   


రెండు రోజుల క్రితమే సంకేతాలు 


నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


తనపైనే దాడి చేసి.. తనపైనే హత్యాయత్నం కేసులు పెట్టారన్న చంద్రబాబు          


రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాలువలు తవ్వుతున్నారని..  తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా?  అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని  అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నాయకులు నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.  హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారని..  - నేను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారని ఆరోపించారు.  - ఎన్‍ఎస్‍జీ భద్రత ఉన్న నాపై వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారన్నారు.  తనపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు.