కొంచెం ఇష్టం - కొంచెం కష్టం- జాతీయ కూటముల భేటీకీ బీఆర్‌ఎస్, వైసీపీ, టీడీపీ దూరం
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి ఇలానే ఉందా...? లెఫ్టో, రైటో... ముందుకో, వెనుకకో అన్నట్టు. పొలిటికల్ సినారియో చూస్తే అదే అనిపిస్తోంది. ముందు ఓ విషయం చెప్పుకుందాం. ఇవాళ, రేపు బెంగళూరులో విపక్ష పార్టీల భేటీ ఉంది.సుమారు 26 పార్టీలకు ఆహ్వానాలు అందాయి. దిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో... ఈ భేటీకి ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ కూడా హాజరవుతున్నారు. కూటమికి పేరు, ఎజెండా, సీట్ల సర్దుబాటు..... ఎన్నికలు మరో ఏడాదిలోకే వచ్చిన తరుణంలో ఇలాంటి కీలక అంశాలపై చర్చించబోతున్నారు.
రేపు దిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల భేటీ జరగబోతోంది. సుమరు 30కిపైగా పార్టీలకు ఆహ్వానం అందింది. తెలుగురాష్ట్రాల నుంచి కేవలం జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవబోతున్నారు.
ఇలా ఒకే సమయంలో అధికార, విపక్షాల భేటీలు దేశవ్యాప్తంగా ఆసక్తి రాజేశాయి. కానీ అంతకన్నా ఎక్కువ చర్చ మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. దానికి కారణం జనసేన తప్ప మరో తెలుగు ప్రాంతీయ పార్టీ ఈ రెండు భేటీల్లో దేనికీ వెళ్లకపోతుండటమే. ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ఇట్టే అర్థమవుతుంది..... అటు వైసీపీ, ఇటు టీడీపీకి కానీ వేర్వేరు రాజకీయ అవసరాల వల్ల బీజేపీతో మంచి సంబంధాలు అవసరం. కానీ అలా అని నేరుగా వెళ్లి వెంటనే ఎన్డీయేలోనూ కలిసిపోలేరు. ఎందుకంటే అలా చేస్తే పొలిటికల్‌గా కాస్త డెలికేట్ సిట్యుయేషన్ లోకి వెళ్లిపోతారు కాబట్టి... దాన్ని వాళ్లు రిస్క్ చేయరు. కేంద్రంలో మద్దతు విషయమై ఈ రెండు పార్టీలూ త్రిశంకు స్వర్గంలో ఉన్నాయేమో అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా కూడా ఇదే కొనసాగించొచ్చు. అప్పటి ఫలితాలు బట్టి, అవసరాల బట్టి వారి నిర్ణయం ఉంటుంది. ఆ రెండు పార్టీల పరిస్థితి అర్థమైంది కాబట్టే... విపక్షాల భేటీకి వారికి ఆహ్వానం అందలేదు. ఇది ఏపీ ప్రాంతీయ పార్టీల పరిస్థితి.
తెలంగాణ బీఆర్ఎస్ విషయానికి వద్దాం. అఫ్ కోర్స్ యాంటీ బీజేపీగా అనేకసార్లు దూకుడుగా వ్యవహరించింది. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వంటి చోట్ల పర్యటించినప్పుడు కూడా విమర్శల దాడి చేశారు. యాంటీ బీజేపీ కదా అని విపక్షాల భేటీకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి. ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అన్నట్టుగా సీన్ ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ నువ్వా నేనా అనుకుంటూ..... అక్కడ కలిసి పనిచేయడం అనేది సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ మొదట్నుంచి చెప్తోంది యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ అని. కానీ అది ఎంతదాకా సాధ్యమవుతుందో....ఒక్కరే జాతీయ రాజకీయాల్లో ఎంతమేర ప్రభావం చూపగలరో వేచి చూడాలి. ఏపీ పార్టీల తరహాలోనే.... కేసీఆర్ కూడా ఎటువైపూ అడుగేయకుండా ఒంటరిగానే లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొని అప్పటి ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సో ఇదీ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అనేక పరిణామాలు జరుగుతున్నా సరే.... ఎటువైపూ స్పష్టంగా అడుగువేయలేని పరిస్థితిలో ఉన్నాయి బీఆర్‌ఎస్, వైసీపీ, టీడీపీ.