ఒకరు వైసీపీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు.. మరొకరు ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు మంత్రి. అయితే వీరిద్ధరి మధ్య రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా టిక్కెట్‌ రగడ రాజుకుంటోంది. ఒకప్పుడు సొంత నియోజకవర్గమైన రామచంద్రపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున రెండు సార్లు నెగ్గిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పక్క నియోజకవర్గం అయిన మండపేట వెళ్లాల్సివచ్చింది. బోస్‌ సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దింపింది వైసీపీ అధిష్టానం. అయితే మండపేటలో బోస్‌ ఓడిపోతే రామచంద్రపురంలో వేణు నెగ్గడం జరిగిపోయింది. 


తన కుమారునికి టిక్కెట్‌ ఇవ్వాలని పట్టు..
రామచంద్రపురం నియోజకవర్గంలో  సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణు తన పట్టు నిలుపుకుని మళ్లీ ఇక్కడ తనకే సీటు అంటూ దూసుకుపోవడంతో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బోస్‌కు వేణుకు మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు సైతం బోస్‌ దూరంగా ఉంటున్నారంటున్నారు. ఇటీవలే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఉభయగోదావరి జిల్లాల ఇంఛార్జ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి నేతృత్వంలోని సమావేశానికి సైతం సుభాష్‌ చంద్రబోస్‌ గైర్హాజరయ్యారు. ఇప్పటికే తన కుమారుడు సూర్యప్రకాష్‌కు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని బోస్‌ పట్టుపడుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎటువంటి క్లియరెన్స్‌ రాకపోగా తమ వర్గాన్ని మంత్రి వేణు పూర్తిగా అణగదొక్కుతున్నారని, ఈసారి బోస్‌ తనయునికి టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతామని హెచ్చరిస్తున్నారు..


రామచంద్రపురంలో బోస్‌ వర్గీయుల సమావేశం..
ఆదివారం రామచంద్రపురంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గీయులు పెద్దఎత్తున సమావేశం అయ్యారు. మంత్రి వేణు తమను అన్ని విధాల అణగదొక్కుతున్నారని, బోస్‌ తనయునికి ఈసారి టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా అయినా బరిలోకి దింపి నెగ్గించుకుంటామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. మంత్రి వేణుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే అదే రోజు విశాఖపట్నంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వేణు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య తదితర బీసీ నాయకులతో సమావేశం జరిగింది. కాకినాడలో ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కూడా బీసీ సమావేశం నిర్వహించారు. 


టిక్కెట్టు నాదే అంటున్న మంత్రి వేణు..
రామచంద్రపురం నుంచి ఈసారికూడా తానే పోటీ చేస్తున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తన పని తాను చేసుకుపోతున్నానని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందంటున్నారు.. తొలిసారి ఎమ్మెల్యే పదవి చేపట్టి మంత్రి పదవిని సంపాదించుకున్న వేణుగోపాలకృష్ణకు మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ ఓటమి పాలవ్వడం అవకాశం కలిసివచ్చినట్లయ్యింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి నుంచి బోస్‌ జగన్‌ వెంటే నడిచారు. అయితే 2014లో రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వడం, 2019ఎన్నికల్లో మండపేట నుంచి సరైన అభ్యర్ధి లేకపోవడంతో అక్కడకు పంపించారు. అక్కడ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రి పదవిని ఇచ్చారు జగన్‌.


మారిన పరిణామాలనేపథ్యంలో బోస్‌ను రాజ్యసభకు పంపించడం, అదేసామాజిక వర్గానికి చెందిన వేణుకు మంత్రి పదవి వరించడం జరిగింది. 2019లో రామచంద్రపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన్ని మండపేట ఇంఛార్జ్‌గా నియమించడంతో బోస్‌కు ఏ నియోజకవర్గంలోనూ చోటు దక్కని పరిస్థితి నెలకొంది. అయితే సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురంలో సుభాష్‌ చంద్రబోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌ బోస్‌ వర్గీయుల నుంచి నానాటికీ తీవ్రమవుతోంది.. అయితే ఈపరిణామాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు.