Janasena Chief Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. ప్రధాన పార్టీలన్నీ సీట్ల సర్దుబాటు మొదలుపెట్టాయి. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేగం పెంచారు. ఇప్పటికే వారాహి విజయయాత్ర తొలి విడత పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో విడత విడత వారాహి యాత్రలో వైసీపీ నేతల్ని కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారు. మరోవైపు పార్టీలో చేరికలపై సైతం పవన్ ఫోకస్ చేస్తున్నారు. విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అధికార పార్టీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 


పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టి.వి.రామారావులను నియమించారు. టి.వి రామారావు గతంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. ఈ ముగ్గురికీ పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ను నియమిస్తూ నియామక పత్రం అందచేశారు. నూతనంగా నియమితులైన వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రజలకు అవిరళమైన సేవలు అందించాలని, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.
 ఇప్పటి వరకు రాజానగరం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన మేడా గురుదత్, పిఠాపురం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన మాకినీడు శేషుకుమారిలకు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగిస్తామని, వారి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.



పవన్ కళ్యాణ్ తో ముగిసిన పంచకర్ల రమేష్ బాబు భేటీ- జనసేనలో చేరేందుకు డేట్, టైమ్ ఫిక్స్
విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల అధికార పార్టీని వీడటం తెలిసిందే. జనసేన పార్టీలో చేరాలని పంచకర్ల నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలివారు. తన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జులై 20న తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు.

జనసేన భావజాలం నచ్చడంతో ఆ పార్టీలో చేరతానని పవన్ కళ్యాణ్ తో చెప్పగా ఆయన స్వాగతించారని చెప్పారు. జులై 20న తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను అని రమేష్ బాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానన్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial